విజయానికి అడ్డదారులు ఉండవు.. ఏ దారిలో వెళ్లినా.. విజయం.. విజయమే. కేసీఆర్ లాంటి రాజకీయ నేతలకు… ఇది బాగా తెలుసు. అందుకే తన లక్ష్యం తెలంగాణ సాధించడం… బంగారు తెలంగాణగా మార్చడం. మొదటిది సాధించారు. రెండో లక్ష్యం సాధనలో.. రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు.. ఆయన రాష్ట్రం సాధిస్తారని ఎవరూ నమ్మలేదు. కానీ నిజం చేశారు. ఇప్పుడు.. బంగారు తెలంగాణ అంటున్నారు… నిజం చేసి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే వినూత్నమైన పథకాలు అమల్లోకి తెచ్చారు. రైతుబంధు లాంటి పథకాలను.. కేంద్రం కూడా వేరే పేర్లతో ప్రకటించాల్సి వచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనైతే కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు.. కేసీఆర్ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది. తానే ఇంజినీర్ అయి.. ప్రాజెక్టు ఆనుపానులన్నీ అధ్యయనం చేసి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి … ఐదేళ్లలోనే ఓ రూపునకు తీసుకు రావడం అసాధారణమైన విషయం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఓ ఇంజనీరింగ్ అద్భుతం. గోదావరిని రివర్స్ పంపింగ్ చేయ డం.. భారీ పంపులు.. మోటర్లు బిగించడం.. సొరంగాలను తవ్వడం.. విద్యుత్ సౌకర్యం కల్పించడం.. ఓ పద్దతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు.
విద్యుత్ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలైతే ఎవరూ ఊహించలేదు. రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే ఉన్న ఉత్పత్తికి రెట్టింపు డిమాండ్ ఉన్నచోట కోతలులేని కరంట్ని ఇస్తున్నారు. దేశంలోనే వ్యవసాయరంగానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలో.. అంతే పట్టుదలగా అమలు చేయగలరు కేసీఆర్. ఆయన అడుగులో.. ఆలోచనలో ఆవరించింది బంగారు తెలంగాణ స్వప్నమే. అది సాకారం చేసుకోవడం కోసమే ఆయన తపన. ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలి. రాష్ర్టానికి వస్తున్న సంపదను ప్రజలకు పంచగలగాలి. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి అవినీతి మచ్చ పడకుండా పరిపాలన సాగించినపుడు.. ఆ పాలకుడిని ప్రజలు కడుపులో ఆదరిస్తారు. అందువల్లే.. ఆయన రెండో సారి విజయం సాధించారు.
పాలన విషయంలో.. ఆయనపై ఎన్నో విమర్శలు ఉండవచ్చు. సెక్రటేరియట్ కు వెళ్లరని.. .. రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తారని.. ఏదైనా రాజకీయ కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని.. ఇలా రకరకాల విమర్శలు ఉండవచ్చుకానీ.. ఏం చేసినా.. ప్రజల ఆదరణ పొందే విషయంలో.. వారి మద్దతు పొందేందుకు ఆయన ..తెలంగాణ ప్రజల మనసుల్ని చదివినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఆయనను.. తెలంగాణలో ఎవరూ అందుకోని ఇమేజ్ ఉన్న మాస్ లీడర్‌గా నిలబెడుతోంది. హ్యాపీ బర్త్ డే కేసీఆర్..!