హైడ్రా. హైదరాబాద్ లో అన్యాక్రాంతం అవుతున్న చెరువులు, నాలాల రక్షణ కోసం దూకుడుగా పనిచేస్తున్న సంస్థ. ప్రభుత్వ పెద్దల నుండి ఫుల్ సపోర్ట్ ఉంటే ఎంత కఠినంగానైనా ఉండొచ్చు అనేందుకు ఇప్పుడు హైడ్రానే ఉదాహరణ.
సంస్థ ఏర్పడి నెల రోజులవుతోంది. కానీ హైదరాబాద్ నగరంలో హైడ్రా అంటే నాయకుల్లో కాస్త అయినా వణుకు కనిపిస్తోంది. విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతూ, అధికారాన్ని అడ్డంపెట్టుకొని యధేచ్చగా వ్యాపారం చేసుకుంటున్న నాయకులను కూడా వదలటం లేదు. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ రాజకీయ ఒత్తిళ్లను ఏమాత్రం లెక్కచేయటం లేదు.
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నీ సంగతి సీఎం దగ్గరే తేల్చుకుంటానంటూ మీడియా ముందే హెచ్చరించారు. ఎంఐఎం ఎమ్మెల్యే నిర్మిస్తున్న అక్రమ కట్టడం కూల్చివేస్తే… ఆ పార్టీ గుర్రుగా ఉంది. ఒక ఎంఐఎం కార్పోరేటర్లు అయితే ఈ కమిషనర్ ను మార్చండి అంటూ గొంతెత్తారు. ఇదంతా కేవలం నెల రోజుల్లోనే.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సీఎం నుండి స్పష్టమైన ఆదేశాలున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే కమిషనర్ వెనక్కి తగ్గటం లేదన్నది మున్సిపల్ వర్గాల్లో చర్చ. అయితే, నెల రోజుల వ్యవధిలో ఆయన కేవలం సౌత్ జోన్ పైనే ఫోకస్ పెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కానీ, హైడ్రా మాత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ అంతటా తమ పని వేగం పెరుగుతుందని, అవసరం అయితే అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.