ఏపీలో అల్లర్లపై సిట్ దూకుడు వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అల్లర్ల విషయంలో వైసీపీ నేతలు చెప్పినట్లు కిందిస్థాయి పోలీసులు వ్యవహరించడంతోనే పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొనడంతో అటు అధికారులు, ఇటు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంలో సిట్ దూకుడుతో మున్ముందు ఎలాంటి చర్యలకు పూనుకుంటుందోనని కంగారు పడుతున్నారు.
అల్లర్లకు తెగబడిన వారిపై కీలక నేతల సూచనల మేరకు పోలీసులు బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. విధ్వంసకాండకు పూనుకుంటే ఇలాంటి చిన్న సెక్షన్స్ కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సిట్ సీరియస్ అవ్వడంతో ఈ కేసులో అదనపు సెక్షన్లు జోడించనున్నారు. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏంటని నేతలు టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలను దూషించడంతోపాటు దాడులు కూడా జరిగాయి. అయినా , దాడులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను సిట్ మందలించింది. సెక్షన్లు మార్చాలని గట్టిగా హెచ్చరించడంతో వైసీపీ నేతలపై ఏసీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు కానున్నాయి. దీంతో అనవసరంగా బుక్ అయ్యామని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
పల్నాడు జిల్లాలో పోలీసు స్టేషన్ లోపలి వెళ్లి బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేసినా చిన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఏంటని సిట్ అధికారులు పోలీసులను ప్రశ్నించారు. దీని వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని సిట్ తేల్చింది. అందుకే తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వదిలేశారని సిట్ భావిస్తోంది.
దీంతో ఏపీ అల్లర్ల విషయంలో సిట్ దూకుడుతో కొద్ది రోజుల్లో వైసీపీ నేతల అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.