ఎంపీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎలాంటి ఫలితాలు రానున్నాయని కాంగ్రెస్ డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎంతమేర పోలింగ్ నమోదైంది..? అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారా..? టఫ్ కాంపిటేషన్ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితం రానుంది..? అనే అంశాలపై అభ్యర్థులతో చర్చించింది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. అయితే, డైవర్ట్ ఓటు కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో శాపంగా మారనుందా..? అని ఆందోళన చెందుతోంది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తాం అని అభిప్రాయానికి వచ్చినట్లుగా ఉన్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా గుసగుసలు వినిపించాయి. అదే సమయంలో జాతీయ అంశాలు ఎజెండాగా సాగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రేసులో లేకుండా పోయిందని దాంతో ఆ ఓటు బ్యాంక్ బీజేపీ వైపు టర్న్ అయిందన్న ప్రచారంతో , అది కాంగ్రెస్ కు నష్టం చేస్తుందా..? అని హస్తం లీడర్లు ఆందోళన చెందుతున్నారు.
వంద రోజుల పాలనకు ఎంపీ ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరు గ్యారంటీలను చూసి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారా..? లేదా అని టెన్షన్ పడుతున్నారు. రూరల్ ఏరియాలో కాంగ్రెస్ ను ఆదరించిన ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపారని… గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా బీజేపీ చొచ్చుకెళ్ళిందనే ప్రచారం హస్తం శిబిరంలో అలజడి రేపుతోంది.
పోలింగ్ సరళి చూశాక మంత్రులు, ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎంపీ ఎన్నికల్లో అధిక మెజార్టీ వచ్చేలా పని చేయాలని హైకమాండ్ ఆదేశించింది. మెజార్టీ రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో ఇప్పుడు మెజార్టీ వస్తుందా…? అని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితం వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.