స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరుగులేదని తేలిపోయింది. ఆరు చోట్ల ఎన్నికలు జరిగితే ఓటర్లందర్నీ పక్కాగా క్యాంపులకు తీసుకెళ్లి.. ఓటింగ్ వరకూ తీసుకొచ్చి పని చేయించుకున్నారు . దీంతో ఓ పని అయిపోయింది. అయితే తమతో క్యాంపులకు వచ్చిన వారంతా తమ అభ్యర్థికే ఓటువేశారా అన్న సందేహం కొంత టీఆర్ఎస్ నేతల్లో ఉంది. అలాంటిది ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో ఉంది. అక్కడ రెండు స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి. టీఆర్ఎస్కు 70 శాతానికిపైగా ఓట్లున్నాయి.
కానీ సర్దార్ రవీందర్ సింగ్తో పాటు ఈటల నిలబెట్టిన మరో అభ్యర్థి బరిలో ఉన్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ ప్రారంభమయింది. ఈటల అందర్నీ సమన్వయం చేసుకుని చివరికి టీఆర్ఎస్కు షాకివ్వాలని తీవ్రంగా ప్రయత్నించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఈ సారి హుజురాబాద్ తరహాలో సక్సెస్ కాలేదని చెబుతున్నారు. టీఆర్ఎస్ పకడ్బందీగా ఓట్లను వేయించుకుందని చెబుతున్నారు. పార్టీపై అసంతృప్తి ఉన్నా.. ముఖ్య నేతలంతా వెంటే ఉండటంతో చాలా మంది అనుకూలంగా నే ఓట్లేసినట్లుగా చెబుతున్నారు. అయితే చాలా చోట్ల అంతర్గత విబేధాలు బయటపడ్డాయి.
ఖమ్మంలో హేమాహేమీల్ని కాదని .. పార్టీ ఫండ్ ఇచ్చారన్న కారణంగా ఓ కొత్త అభ్యర్థికి చాన్సివ్వడం ఆ పార్టీ నేతలకు నచ్చలేదు. అయితే ఈ కారణంగా వారంతా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసే పరిస్థితిలేదని నమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ పూర్తి స్థాయి బలం ఉన్నా… అన్ని అస్త్రాలూ ప్రయోగించింది. ఇంత చేసినా తర్వాత ఒక్క సీటు కోల్పోయినా… ఆ పార్టీ పట్టు జారిపోయినట్లుగానే భావించాల్సి వస్తుంది.