చిత్రసీమకు ఓ విచిత్రమైన సమస్య చుట్టుకొంది. అదేంటంటే.. పెద్ద హీరోలకు సరిపడా హీరోయిన్లు దొరకడం లేదు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, రవితేజ… ఇలా బడా హీరోలకు సరిపడా కథానాయికలకు టాలీవుడ్లో కొరత వచ్చింది. వీళ్ల సినిమాలు ఆలస్యం అవ్వడానికి అసలు సిసలైన కారణం… వాళ్లకు సరిపడా కథానాయికలు లేకపోవడమే. ఇప్పుడంతా యంగ్ జనరేషన్ హీరోయిన్లదే హవా. రకుల్, రాశీఖన్నా, కీర్తి సురేష్, అనుఇమ్మానియేల్, సాయి పల్లవి… ఇలా యంత్ తరంగ్ తమ టాలెంట్ చూపించేస్తోంది. వాళ్లేమో.. బడా హీరోల పక్కన ఏమాత్రం ఆనరు. కాదూ.. కూడదు అని తీసుకొంటే సరదు హీరోకి చెల్లెల్లానో, కూతుర్లలానో కనిపిస్తారు. దాంతో మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్ భామల్ని దిగుమతి చేసుకొందామంటే.. వాళ్లేమో పారితోషికాల దగ్గర పేచీ పెడుతున్నారు. దాంతో బడా బాబులకు హీరోయిన్లను వెదికి పట్టుకోవడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారం అవుతోంది.
నయనతార, అనుష్క, కాజల్, త్రిష… వీళ్లే కాస్త ఏజ్ బార్ అయిన హీరోయిన్లు. బాలయ్య, వెంకీ, చిరు, రవితేజల సినిమాలకు వీళ్లు పక్కాగా సరిపోతారు. కానీ.. వీళ్లు కూడా కెరీర్ చివరి దశకు వచ్చేశారు. నయనతార ఎప్పుడు ఏ సినిమా ఒప్పుకొంటుందో చెప్పలేం. పైగా తెలుగు సినిమా అంటే ఆముదం తాగిన ఫేసు పెడుతుంటుంది. అనుష్క.. మనసు ప్రస్తుతం సినిమాలపై లేదు. ఆమెనూ సినీ జనాలు లెక్క లోనికి తీసుకోవడం లేదు. భాగమతి తరవాత అనుష్క కెరీర్ ఏమవుతుందో అనే అనుమానంలో పడింది. కాజల్ ఫేడ్ అవుట్ అయిపోతోంది. అందరినీ వెదికి వెదికి ఎవరూ దొరక్కపోతే కాజల్ పేరు పరిశీలిస్తున్నారు తప్ప.. తను మొదటి ఆప్షన్ కావడం లేదు. త్రిష ని కూడా దాదాపుగా మర్చిపోయారంతా. శ్రియ లాంటి వాళ్లే కాస్త బెటర్ అనిపిస్తోంది. అందుకే శ్రియకు అవకాశాలు వస్తున్నాయి. 30 దాటిన ముదురు ముద్దు గుమ్మల కోసం టాలీవుడ్ దర్శకులు వేట ప్రారంభించారు. కానీ.. వాళ్ల అన్వేషణ ఓ కొలిక్కి రావడం లేదు. విద్యాబాలన్ లాంటి వాళ్లని దిగుమతి చేసుకొందామంటే.. సినిమా బడ్జెట్లో సగం పారితోషికం కింద అడుగుతున్నారు. దాంతో నిర్మాత గుండె గుభేలుమంటోంది.
స్టార్ హీరోలు కూడా పద్ధతి మార్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికీ.. వాళ్లని బ్రహ్మాచారులుగానే చూపించాలా?? వాళ్లకు లవ్ ట్రాక్ ఉండాల్సిందేనా?? గురు సినిమా చూడండి. అందులో హీరోయిన్ ఉంది. కానీ డ్యూయెట్లు లేవు కదా? గౌతమి పుత్ర శాతకర్ణిలో కూడా రొమాన్స్‌కి పెద్ద పీట వేయలేదు. కాకపోతే ఈ తరహా కథల్ని ముందు వెదికి పట్టుకోవాలి. హీరోయిజానికి కొత్త అర్థం వెదుక్కోవాలి. ఇప్పటికీ పొదల మాటుకి వెళ్లి… చెట్టూ పుట్టా పట్టుకొని డ్యూయెట్లు పాడుకొంటా నంటే.. ఇదిగో ఇలానే హీరోయిన్ల కోసం భూతద్దాలు పట్టుకొని వెదుక్కోవాల్సివుంటుంది.