బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా చూట్టాయి. కొబ్బరికాయ్ కొట్టినప్పటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం, బజ్ క్రియేట్ చేసేపనిలో పడ్డారు మేకర్స్. అయితే ‘రాజాసాబ్’ విషయంలో మాత్రం ఈ పాన్ ఇండియా బజ్ పై అంతగా ద్రుష్టిపెట్టడం లేదు. దీనిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా స్కేల్ ఆయన గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గదు. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, గ్రాఫిక్స్ అన్నీ వుంటాయి. కానీ మేము ఒక అండర్ డాగ్ లా ఉంటున్నాం. సినిమానే గట్టిగా మాట్లాడుతుంది’ అని చెప్పుకొచ్చారు విశ్వప్రసాద్.
ఇక టికెట్ రేట్ల గురించి మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని కోరలేదు. పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా కూడా మామూలు రేట్లకే విడుదల చేశాం. ఇండస్ట్రీ సమిష్టిగా ఏ నిర్ణయం తీసుకుంటే దానిపైనే వుంటాం’ అన్నారు. ఇక మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తారా అని ప్రశ్నకు ‘మేము ప్రయత్నిస్తున్నాం. అయితే ఆయన చాలా బిజీగా వున్నారు. ఆయన వేడుకకు వస్తే అంతకంటే ఆనందం వుండదు’ అన్నారు. రవితేజతో విశ్వప్రసాద్ నిర్మించిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న వస్తున్న సంగతి తెలిసిందే.