తమిళనాట రాజకీయాల్ని తిరగరాసిన ఘనత జయలలితది. ఆమె ప్రస్థానం… నిజంగానే సినిమా ఫక్కీలో సాగుతుంది. ఏ అసెంబ్లీలో.. తనని అవమానించారో, ఏ అసెంబ్లీ నుంచి తనని గెంటి వేశారో.. అదే అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయిన తరవాతే వస్తా.. అని ప్రతిన బూని, ఆ మాట మీదే నిలబడి, గెలిచి – తన శపథం నెరవేర్చుకుంది జయలలిత. ఇంతకంటే హీరోయిజం ఎక్కడ ఉంటుంది..? జయలలిత కథ.. సినిమాలుగా, వెబ్ సిరీస్ గా వచ్చాయంటే కారణం అదే. ఇప్పుడు మరోసారి ఈ కథ వెండి తెరకెక్కింది. `తలైవి` పేరుతో. సున్నితమైన, విలక్షణమైన కథల దర్శకుడిగా పేరొందిన విజయ్… జయలలిత కథని చెప్పాలనుకోవడం, జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ ఆ పాత్ర పోషించడంతో `తలైవి`పై సహజంగానే ఆసక్తి నెలకొంది. మరి ఈ తలైవి ఎలా ఉంది? జయలలిత కథని సాధికారికంగా చెప్పగలిగారా, లేదా?
జయలలిత గురించి, ఆమె రాజకీయ ప్రస్థానాన్ని గురించి తెలిసివాళ్లకు ఇది బాగా సుపరిచితమైన కథే. జయలలిత (కంగనా) చిన్న వయసులోనే కథానాయికగా చిత్రసీమలోకి అడుగుపెడుతుంది. ఆమె అల్లరి, అమాయకత్వం, పొగరు.. ఎంజేఆర్ (అరవింద స్వామి)కి బాగా నచ్చుతుంది. వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. వరుసగా సినిమాలు చేస్తుంటారు. దాంతో చనువు పెరుగుతుంది. జయ ఎంజేఆర్ని ఆరాధిస్తుంది. ఎంజేఆర్ లక్ష్యం వేరు. ప్రజా సేవ చేయడం. తన మిత్రుడు కరుణానిధి (నాజర్)ని సపోర్ట్ చేసి ఆ పార్టీ గెలవడానికి కారణం అవుతాడు. అయితే… పార్టీలో తనకు పలుకుబడి లేదని గ్రహించి, బయటకు వచ్చేస్తాడు. ఈ సమయంలో వేరే పార్టీ స్థాపిస్తాడు. పార్టీ కోసమే జయని దూరం పెడతాడు. అయితే… పార్టీకి అవసరమైన సమయంలో జయ.. తన సహాయ సహకారాల్ని అందిస్తూనే ఉంటుంది. కరుణానిధి అనారోగ్య బారీన పడి, వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు.. పార్టీ ని ముందుండి నడిపించి, ఎన్నికలలో గెలిపిస్తుంది. అయితే ఆ తరవాత.. జయనే పార్టీలోంచి గెంటేస్తారు. మరి జయలలిత మళ్లీ పార్టీలోకి ఎలా వచ్చింది? ఆ క్రమంలో ఆమెకు ఎదురైన అవమానాలేంటి? దాన్ని ఎలా దాటుకుని గెలుపు తీరాలకు చేరింది? అనేదే కథ.
జయలలిత కథలో నాటకీయత ఉంది. ధీరత్వం ఉంది. పరిస్థితులకు తలొగ్గకుండా పోరాడడం ఉంది. ఇదంతా సినిమా మెటీరియలే. కాబట్టి… ఓ కమర్షియల్ సినిమాకి కావల్సిన హంగులన్నీ ఈ కథలోనే ఉన్నాయి. దానికి విజయేంద్ర ప్రసాద్ లాంటి మాస్టర్ తోడైతే చెప్పేదేముంది? గూజ్బమ్స్ మూమెంట్స్ ఎక్కడ ఎలా ఇవ్వాలో.. విజయేంద్ర ప్రసాద్ కి బాగా తెలుసు. తమిళ నాడు చరిత్రని తిరగరాసిన అసెంబ్లీలో అవమానం ఘటనని తొలి సన్నివేశంలోనే చెప్పేసి – కదన రంగానికి సిద్ధం చేసేశాడు దర్శకుడు. నిజానికి మామూలు కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాన్ని ఇంట్రవెల్ బ్యాంగ్ గా వాడతారు. కానీ విజయ్.. ఆయువు పట్టులాంటి సీన్ ని ముందే చెప్పేసి, ప్రేక్షకుల్ని అటెన్షన్లో పెట్టేశాడు. విజయ్ దీన్ని ఓ బయోపిక్ లా అనుకోలేదు. సినిమా కథకు ఎంత కావాలో అంతే తీసుకున్నాడు. జయలలిత బాల్యం, ఆమె సినిమాల్లో రావడానికి చేసిన ప్రయత్నాలు, జయలలిత పుట్టు పూర్వోత్తరాలు.. వీటి జోలికి వెళ్లలేదు. జయని నేరుగా సినిమా హీరోయిన్‌గానే పరిచయం చేసి, రన్ టైమ్ ని తగ్గించుకున్నాడు. జయలలిత కథలోకి ఎంజీఆర్‌ని తీసుకురావడానికి అస్సలు టైమ్ తీసుకోలేదు. తొలి సన్నివేశాల్లో జయగా కంగనా చిలిపిదనం, అల్లరి, పొగరు… ఇవన్నీ బాగా నచ్చుతాయి. జయ తత్వం ఏమిటో, ఆమె ఆత్మాభిమానం ఎలాంటిదో తొలి సన్నివేశాల్లోనే చూపించారు. ముఖ్యంగా వీరప్పన్ (సముద్రఖని)కీ జయకీ ఉన్న టామ్ అండ్ జెర్రీ ఆట బాగా సాగుతుంది. `మినపగారె` ఎపిసోడ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎంజేఆర్ తనని దూరం పెట్టినప్పుడు, హీరోయిన్ గా తన పాత్రని చంపేసి, మరొకరికి ఛాన్స్ ఇచ్చినప్పుడు జయలలిత తీసుకున్న నిర్ణయం, శివాజీ గణేశన్ కి దగ్గరైన వైనం.. ఇవన్నీ జయలలిత సినిమాల్లో చేసిన రాజకీయాన్ని గుర్తు చేస్తాయి. జయలలితని తొలిసారి `అమ్మా` అని పిలిచిన ఎపిసోడ్ సైతం. ఆమె అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. ఇలా.. అక్కడక్కడ కొన్ని హై సీన్లు ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.
తొలి సగంలో ఇది జయలలిత కథ కంటే, ఎంజేఆర్ – జయలలితల లవ్ స్టోరీలానే కనిపిస్తుంది. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తమిళులకు బాగా తెలుసు. కాబట్టి.. ఆయా సన్నివేశాలకు వాళ్లు కనెక్ట్ అవుతారు. తెలుగు వెర్షన్‌కి వచ్చిన చిక్కేమిటంటే… దర్శకుడు విజయ్ తెలుగు ప్రేక్షకుల గురించి పట్టించుకోలేదు. జయలలిత తమిళ నటి మాత్రమే కాదు. తెలుగులోనూ సూపర్ హిట్లు కొట్టింది. ఎన్టీఆర్, శోభన్ బాబులాంటి హీరోలతో నటించింది. శోభన్ బాబు – జయలలిత లవ్ ట్రాక్గురించి తెలుగులో కథలు కథలుగా చెప్పుకుంటారు. తెలుగులో జయ ప్రస్థానం గురించి చెబుతూ.. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి పాత్రలు చూపిస్తే… తెలుగు ప్రేక్షకులు మరింత కనెక్ట్ అయ్యేవారు. తమిళ సూపర్ హిట్ సీన్లకు, పాటలకు రిప్లికాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. తమిళ ప్రేక్షకులు ఎంజాయ్ చేసింతగా తెలుగు ప్రేక్షకులు చేయకపోవొచ్చు. శశికళ పాత్ర.. జయ జీవితంలో చాలా కీలకం. దాన్ని అంటీముట్టనట్టు అలా వదిలేశాడు దర్శకుడు. అంతేకాదు… జయలలిత ముఖ్యమంత్రి అవ్వడంతో కథ ముగుస్తుంది. కానీ.. అసలు కథ.. జయ ముఖ్యమంత్రి అయిన తరవాతే సాగుతుంది. కరుణానిధిపై ఆమె ప్రతీకారం తీర్చుకోవడం కూడా.. ప్రేక్షకులకు గూజ్బమ్స్ ఇచ్చే మూమెంటే. దాన్ని వదిలేశాడు దర్శకుడు. లేనిపోని గొడవల్లో,వివాదాల్లో తలదూర్చడం ఇష్టం లేకేమో…?
కంగనా నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఆమె జాతీయ ఉత్తమ నటి. మరోసారి తనకిచ్చిన పాత్రలో అల్లుకుపోయింది. నిజానికి కంగనాకు ఇది చాలా క్లిష్టతరమైన పాత్ర. తనని ఏ కోణంలోంచి చూసినా ఉత్తరాది అమ్మాయిలానే కనిపిస్తుంది. దక్షిణాన తనదంటూ ముద్ర వేసిన జయ పాత్రలో అమె సరిపోతుందా? అనే అనుమానాలు రావడం సహజం. వాటిని తను పటాపంచలు చేసింది. కథానాయికగా తన అల్లరి, నాయకురాలిగా తన పోరాటపటిమ రెండూ అద్భుతంగా చూపించింది. ఎంజేఆర్ గా తన ఎంపిక సరైనదే అని అరవింద్ స్వామి నిరూపించాడు. తన గెటప్ సరిగ్గా సూటైంది. ఇక ఎంజేఆర్ కి కవచం లాంటి పాత్రని సముద్రఖని తనదైన శైలిలో పోషించి మెప్పించాడు.
టెక్నికల్ గా చాలా ఉన్నతంగా ఉన్న సినిమా ఇది. ఆనాటి వాతావరణాన్ని బాగాప్రతిబించించారు. ఆర్ట్, సెట్ వర్క్, నేపథ్య సంగీతం ఇవన్నీ బాగా కుదిరాయి. `వయసైపోయినంత మాత్రన పులి పిల్లయిపోదు` లాంటి శక్తిమంతమైన సంభాషణలు పేలాయి. వివాదాస్పదమైన అంశాల జోలికి పోకుండా.. కేవలం జయ అభిమానుల్ని మెప్పించి, ఆమె ప్రత్యర్థులని సైతం సంతృప్తి పరిచేలా విజయ్ ఈ సినిమా తీశాడు.
ఫినిషింగ్ టచ్: జయ అభిమానుల కోసం