ఆస్కార్…. తెలుగు సినిమాకి అటుంచండి… మన ఇండియన్ సినిమాకే ఈ మాట చాలా దూరం. ఆస్కార్ అవార్డు వేడుకలు జరుగుతున్నాయంటే.. `ఆ.. మనకు సంబంధం ఏముందిలే` అని లైట్ తీసుకొనేవాళ్లమంతా. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ప్రతీ సంవత్సరం మన దేశం నుంచి ఓ సినిమా వెళ్లడం, ఉత్త చేతులతో వెనక్కి రావడం సాధారణమైపోయాయి. లగాన్ లాంటి సినిమాలకు నామినేషన్ దక్కడమే గొప్ప అనుకొన్నారంతా. కమల్ హాసన్ లాంటి వాళ్లు కూడా `ఆస్కార్ తో మనకు సంబంధం ఏమిటి?` అంటూ కోపాన్నంతా వెళ్లగక్కారు. ఆస్కార్ మనకు నిజంగానే అందని ఆకాశంలా కనిపించింది. కానీ ఆ ఆకాశాన్ని ఇప్పుడు నేలకు దించేశాడు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు` పాటకు పురస్కారం దక్కడం, వేదికపై రాజమౌళి, చంద్రబోస్ ఆస్కారు ప్రతిమని ముద్దాడడం మనం చూశాం. కానీ నిజంగా ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడు.. రాజమౌళి.
ఉత్తమ విదేశీ కేటగిరీ విభాగంలో.. `ఆర్.ఆర్.ఆర్`ని అధికారికంగా ఎంపిక చేయనప్పుడు రాజమౌళి కృంగిపోలేదు. అలాగని వదిలేయలేదు. ప్రైవేటు నామినేషన్లలో ఆర్.ఆర్.ఆర్ని నిలిపాడు. అప్పుడు కూడా రాజమౌళి చేసింది అనవసరపు సాహసం లానే అనిపించింది. కానీ… బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు నిలిపి… తన ఆలోచన, ఊహ తప్పు కాదని నిరూపించుకొన్నాడు. ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ సైతం రావడంతో.. ఆస్కార్ పై ఆశలు మరింత రేగాయి. గోల్డెన్ గ్లోబ్ వచ్చిన పాటకు ఆస్కార్ వచ్చే ఛాన్స్ 50 శాతం వరకూ ఉంటుంది. ఈ విషయం రాజమౌళికీ తెలుసు. మిగిలిన 50 శాతం కోసం తాను రంగంలోకి దిగాడు. టీమ్ మొత్తాన్ని అమెరికా తీసుకెళ్లి.. ప్రచారం చేయించాడు. అందని ద్రాక్ష కోసం రాజమౌళి ఆశ పడుతున్నాడనుకొన్నా సరే లెక్క చేయలేదు. ఎప్పుడూ అవార్డుల కోసం, పురస్కారాల కోసం ఆలోచించని రాజమౌళి.. ఆస్కార్ కోసం మాత్రం పట్టుదల చూపించాడు. చివరికి అనుకొన్నది సాధించాడు. నాటు నాటు తో వచ్చింది ఒక్క ఆస్కారే. కానీ… ఈ అవార్డు భారతీయ సినిమా రూపు రేఖల్ని సైతం మార్చేయగలదు. ముఖ్యంగా తెలుగు సినిమాకి ఈ అవార్డు మరింత శోభ తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అవార్డుతో.. త్వరలో రాబోతున్న రాజమౌళి సినిమాలకు కొత్త మార్కెట్ ఏర్పడుతుంది. ఎన్టీఆర్, చరణ్‌లను గ్లోబల్ స్టార్లుగా ప్రపంచం గుర్తిస్తుంది. ఇక కీరవాణి పై హాలీవుడ్ చూపు పడడం తథ్యం. ఇవన్నీ రాజమౌళి విజన్ వల్లే సాధ్యమైన విషయాలు. పదేళ్లు ముందుకెళ్లి ఆలోచిచడం, అందులో విజయం సాధించడంలో రాజమౌళి తరవాతే ఎవరైనా. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. జయహో రాజమౌళి.. హ్యాట్సాఫ్. ఈ దేశానికీ, ముఖ్యంగా తెలుగు గడ్డకు… ఆస్కార్ తెచ్చినందుకు థ్యాంక్యూ.