దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ఆయనను మరో రకంగా చిత్రీకరించి.. ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు అన్ని పార్టీలు హడావుడిగా కార్యక్రమాలను ప్రకటిస్తున్నాయి. విడివిడిగా అయినా అన్ని పార్టీలు కేసీఆర్‌ను రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రకటిస్తున్నాయి.
కేసీఆర్‌ను రాజ్యాంగ వ్యతిరేకునిగా చిత్రీకరిస్తున్న బీజేపీ !
కేసీఆర్‌పై మాట కంటే ముందు కత్తి దూస్తున్న బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. రాజ్యాంగం జోలికొస్తే చూరచూర చేస్తారని బండి సంజయ్ కేసీఆర్‌ను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని…125 అడుగుల బాబా సాహెబ్ విగ్రహాన్ని ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేయాలని నిర్ణయించారు. తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని చెప్పారు.
మాటలు వెనక్కి తీసుకోవాలని టీ కాంగ్రెస్ ఉద్యమం !
ఇక టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిది కూడా అదే బాట. మరోసారి రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే యువతే ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. హెచ్చరికలతో ఆగలేదు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీక్షలు చేయబోతున్నారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పేదలు,బలహీనవర్గాలపై దాడి అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీలు దళిత సంఘాలదీ అదే బాట. ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. మాజీ ఐపీఎస్, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎంతటిత్యాగాలకైనా సిద్ధమని ప్రకటించారు.
రాజ్యాంగ వ్యాఖ్యల విషయంలో డిఫెన్స్‌లో టీఆర్ఎస్..!
కొత్త రాజ్యాంగం ప్రతిపాదనపై కేసీఆర్ చర్చ జరగాలని కోరుకున్నారు. కానీ అంతకు మించి రచ్చ జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడినట్లుగా కనిపిస్తోంది. మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఎన్నికల కోణంలో ప్రకటనల కోసం ప్రకటనలు ఇస్తుండాన్ని ద్రుష్టిలో పెట్టుకుని కేసీఆర్ రాజ్యాంగం మళ్లీ రాయాలన్న వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ వ్యాఖ్యలపై రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఆపార్టీ నేతలంటున్నారు. అయితే ఈ అవకాశాన్ని విపక్షాలు వదులుకునే అవకాశం లేదు.