ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవానికి పద్మ అవార్డులు ప్రకటించడం సంప్రదాయం. భారత రత్న కూడా ప్రకటిస్తారు. కానీ ఖచ్చితంగా ప్రకటించాలనే రూలేం లేదు. ఈ సారి ఎవరికీ ప్రకటించలేదు. కానీ పద్మ అవార్డును మాత్రం కేంద్రం ప్రకటించింది. ఇందులో కొన్ని రాజకీయ పురస్కారాలున్నాయి. ములాయంకు రెండో దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఇంకా కొన్ని రాజకీయ పురస్కారాలు ఉన్నాయి. కానీ అత్యధికం… ఎలాంటి రాజకీయ ఒత్తిడులు .. సిఫార్సులు లేని వారికే దక్కాయి.. ఈ విషయంలో కేంద్రాన్ని అభినందించాల్సిందే.
తెలుగు , రాష్ట్రాల నుంచి పది మంది వరకూ పద్మ పురస్కారాలు దక్కాయి. వీరిలో అందరూ పద్మ అవార్డులకు అర్హులే. ఒక్కరూ లాబీయింగ్ చేసుకునేవారు కాదు. తమకు అవార్డు ఇవ్వాలని వెంటపడేవారు కాదు. కాకినాడకు చెందిన సంకురాత్రి రామారావు చేసిన సేవల గురించి… పద్మ అవార్డు వచ్చిన తర్వాతనే ఎక్కువమందికి తెలిసింది. దాదాపుగా అవార్డులన్నీ ఇలాంటి నిస్వార్థ సేవ.. ప్రతిభావంతులకే ఇచ్చారు. గతంలో పద్మ అవార్డులు సిఫార్సుల మేరకు ఇచ్చే వారు. దాంతో అవి రాజకీయ మద్దతు ఉన్న వారికే లభించేవి.
కేంద్ర ఈ ఆనవాయితీని చాలా వరకూ మార్చింది. రాజకీయ సిఫార్సులు.. ప్రయోజనాల విషయాన్ని పరిమితం చేసుకుంది. అవి తప్పని సరి అయినా.. ఖచ్చితంగా ఈ అవార్డుల గొప్పతనం పెరిగేలా.. .. వివిధ కేటగిరీల్లో నిజమైన పద్మాలను గుర్తించి అవార్డులు ఇస్తున్నారు. ఇది ఓ రకంగా అవార్డుల విలువను పెంచడమే. లాబీయింగ్ చేసుకుని తెచ్చుకునే అవార్డు కన్నా.. కనీసం దఖాస్తు చేసుకోకుండా… సేవలు… ప్రతిభను గుర్తించి కేంద్రం ఇచ్చే అవార్డుకు ఎంతో విలువ ఉంటుంది. ఈ విషయంలో కేంద్రాన్ని అభినందించాల్సిందే.