విశాఖ స్టీల్ ప్లాంట్‌కు భారీ లాభాలని కేంద్రమే చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఉక్కుశాఖ గొప్ప విజయాల్ని సాధించిందంటూ నివేదిక విడుదల చేశారు. ఇందులో విశాఖ స్టీల్స్ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ రికార్డు స్థాయి లాభాల్ని చవి చూస్తోంది. ప్రొడక్షన్లో ఊహించని పురోగతి సాధిస్తోందని వెల్లడించింది.
గత ఏడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్యకాలంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికర లాభం వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ముడి ఉక్కు ఉత్పత్తిలో 47%, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తిలో 75% వృద్ధి సాధించింది. 10 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేసి రూ.4,572 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది కంటే ఇది 45% అధికం.
విశాఖ స్టీల్ 2021-22లో డిసెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు రూ.2,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.331 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది. భారతీయ రైల్వే అవసరాలు తీర్చడానికి ఆర్ఐఎన్ఎల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లాల్గంజ్లో ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్థాయిలో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేస్తారా.. బంగారు బాతును అమ్మేస్తారా అంటే.. కేంద్రం నిర్మోహమాటంగా యస్ అంటోంది. కొనేవాళ్లు ఎవరూ రాకపోతే మూసేస్తాం కానీ నడిపించే ప్రశ్నే లేదని చెబుతోంది.