పెట్రో ధరలు ఇబ్బడిమబ్బడిగా పెంచుతూ ప్రపంచంలోనే అత్యధిక ఇండియాలోనే ఉందన్నపేరు తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా కాస్త ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. టాక్స్లతో కలిపి మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50, లీటర్ డీజిల్‌పై 7 రూపాయలు తగ్గనుంది. వంట గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయల సబ్సిడీని ఇస్తారు. అయితేఇదిఅందరికీ కాదు ప్రధాని ఉజ్వల్ యోజన గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది.
పెట్రోల్ ధర రూ. 110 ఉన్నప్పుడు దీపావళి సమయంలో హఠాత్తుగా రూ. పదితగ్గించింది కేంద్రం. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు మరికొంత తగ్గించాయి. అయితే ఇప్పుడు పెట్రోల్ రేటు రూ. 120 దాటిపోయింది. అంటే దీపావళికితగ్గించిన దాని కంటే ఇప్పుడు రేటు మరోపది రూపాయలు ఎక్కువే అయింది. పెట్రో పన్నుల వల్ల కేంద్రానికి ఏటా నాలుగైదు లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతూండటం.. ప్రజల సంపాదన అంతా పన్నుల పేరుతో పిండేస్తున్నారన్న అసంతృప్తి ప్రజల్లో పెరుగుతూండటంతో కాస్త తగ్గించాలని నిర్ణయించారు.
తగ్గింపు వల్ల రూ. లక్ష కోట్ల భారం పడుతుందని మంత్రి సీతారామన్ చెప్పుకొచ్చారు. కానీ ప్రజల నుంచి అంత మేర పిండుకుంటున్నామని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వంపై పడే భారం ఏమీ ఉండదు.. కానీ ప్రజలపై కాస్త భారం తగ్గుతుంది. అదే సమయంలో పెంచిన ధరలను.. రెండు, మూడు నెలల్లోనే కవర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రేట్లు పెంచడం కేంద్రం చేతుల్లోనే ఉంది. చివరికి నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయిన ఈ దశలో.. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.