ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అన్న ప్రశ్న ఇక ఎప్పుడూ ఉత్పన్నం కాదు. స్టాండప్ కామెడీలకు ఏపీ రాజధాని అంశం ఇక నుంచి ఓ టాపిక్ అయ్యేచాన్స్ లేదు. ఇప్పుడు అందరికీ ఏపీ రాజధాని అమరావతి అనే స్పష్టత వచ్చేసింది. ఏకంగా పది హేను వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామని .. అదీ కూడా ఈ ఒక్క ఏడాదిలోనే అని స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇక అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టడమే మిగిలింది.
ఆగిపోయిన నిర్మాణాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకోనున్నాయి. పరిపాలనా నగరానికి ఓ రూపు రావడానికి రాష్ట్రం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సాయం అందనుంది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరగనున్నాయి. దీంతో అమరావతి ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీ సంకీర్ణంలో టీడీపీ ఉన్నా.. నిధుల విషయంలో మాత్రం అనుకున్నంత సపోర్టు రాలేదు. కేంద్రపట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో రెండున్నర వేల కోట్లు మంజూరయ్యాయి కానీ.. అందులో వెయ్యి కోట్లు పెండింగ్ లో పడిపోయాయి. ఆ తర్వాత అమరావతికి ఎలాంటి సాయం అందలేదు.
Also Read :దటీజ్ బాబు.. అమరావతికి బడ్జెట్లో నిధులు!
చంద్రబాబు మొదటి సారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు అమరావతిని రాజధానిగా ఖరారు చేసి.. భూసమీకరణ చేసి , ఎన్జీటీలో పడిన కేసుల్ని పరిష్కరించుకుని నిర్మాణాలు ప్రారంభించే సరికి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఏడాదిన్నరలోనే వీలైనంత ఎక్కువ ప్రోగ్రెస్ చూపించారు . కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని పక్కన పెట్టేయడంతో పరిస్థితి మారిపోయింది. ఐదేళ్ల పాటు అమరావతి పిచ్చి మొక్కలతో అడవిగా మారింది. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు.
ప్రభుత్వం ముందు ఇప్పుడు ఉన్న అతి పెద్ద సవాల్ పరిపాలనా నగరం పూర్తి చేయడమే. పరిపాలనా నగరాన్ని పూర్తి చేయడానికి ఇప్పటి వరకూ నిధుల సమస్య ఉంది. కేంద్రం పదిహేను వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా సమకూర్చడం ఖాయం కాబట్టి.. వెంటనే పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలతో ఐకానిక్ భవనాల నిర్మాణాలు.. ఉద్యోగులకు వసతి సౌకర్యాలు పూర్తి చేస్తే.. అమరావతి ఓ రూపానికి వస్తుంది.