వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అవినాష్ రెడ్డికి మాత్రం ఊరట నిచ్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఇచ్చే వరకూ అవినాష్ రెడ్డిపై చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. అంటే తీర్పు వచ్చే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదన్నమాట. అదే సమయంలో సీబీఐ విచారణకు పార్లమెంట్ సమావేశాల కారణంగా మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి తరపు లాయర్ అడిగారు. ఈ మినహాంపు కావాలనుకుంటే సీబీఐనే అడగాలని హైకోర్టు సూచించింది.
గత విచారణలో హైకోర్టు ఆదేశించిన విధంగా ఆడియో వీడియోలను .. కేసు ఫైల్స్ ను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ కేసులో వీడియోగ్రీఫీ అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో సీబీఐ ఆఫీసు ముందు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసిన ఆరోపణలూ తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు ఎప్పటికి ఇస్తారో స్పష్టత లేదు. కానీ అప్పటి వరకూ అవినాష్ రెడ్డి పిలిచినప్పుడు విచారణకు మాత్రమే హాజరవుతారు. తీర్పు వచ్చే వరకూ అరెస్టు రక్షణ లభించినట్లే భావిస్తున్నారు.
మరో వైపు ఈ వ్యవహారాన్ని వీలైనంత కాలం పొడిగించాలనుకుంటున్న అవినాష్ రెడ్డి.. మరో పిటిషన్ దాఖలు చేశారు. సునీత దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ వెనుక సీబీఐ ఉందని ఆయన పిటిషన్లో ఆరోపించారు. సీబీఐ చెప్పడం వల్లే సునీత ఇంప్లీడ్ పిటిషన్ వేశారని అందులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసినందునే తాను ఇంప్లీడ్ పిటిషన్ వేశానని సునీత పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పిటిషన్ పై విచారణలు పూర్తయ్యే వరకూ రిజర్వ్ చేసిన తీర్పు రాదన్న ఉద్దేశంతో ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నారన్న వాదన న్యాయవర్గాల్లో వినిపిస్తోంది.