Subrahmanyam vs Kuchimanchi
తొండ ముదిరి ఊసర వెల్లిగా మారిన రోగానికి కీలెరిగి వాత పెడితే మాత్రం ఫలితముంటుందా. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతిని కలిసి, రాష్ట్ర క్యాబినెట్లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలను తీసుకోవడంపై చేసిన ఫిర్యాదు గురించే ఇలా రెండు సామెతలు కలిపి ప్రయోగిస్తున్నది. సుస్థిరమైన మెజారిటీని గెలుచుకుని కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి ఫిరాయింపు చేసుకున్న విధానంపై తొలుత జుట్టూజుట్టూ పట్టుకున్నారు. ఆపై ఇక ఇంతే అని సర్దుకు పోయారు జగన్ రెడ్డి. వారిలో నలుగుర్ని చంద్రబాబు తాజాగా తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తెలంగాణలో తలసాని ఉదంతాన్ని గుర్తుచేస్తూ రుసరుసలాడారు. అప్పట్లో దీన్ని వ్యతిరేకించిన గవర్నర్ నరసింహన్ ఆంధ్రలో ఎలా అనుమతిస్తారని నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా వెడుతున్నానంటూ చెప్పుకోవాలని చూశారు. అప్పట్లో చంద్రబాబు టేపుల్ని బయకు తీసి మరీ ఉదాహరణగా చూపారు. అయినా చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఆయన లొంగింది ఎక్కడంటే భూమా అఖిల ప్రియ అంశంలో. నాగిరెడ్డికి పదవిచ్చేది లేదని కరాఖండిగా చెప్పారనీ వార్తలు కూడా వచ్చాయి. అనంతరం, భూమా హఠాన్మరణం అఖిలప్రియకు మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. నలుగురు ఫిరాయింపుదార్లను మంత్రుల్ని చేసి, రాజ్యాంగాన్ని పరిహసం చేసిన ఆంధ్ర సర్కారు తీరును ఇప్పుడు జగన్‌రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఇక్కడ మనమొక విషయాన్ని ప్రముఖంగా చెప్పుకోవాలి. జగన్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్‌ను స్థాపించినప్పుడు పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మరీ రప్పించుకున్నారు. ఆపై గెలిపించుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా అలాగే గెలిపించుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులివ్వడాన్ని నిరసిస్తూ వైయస్ జగన్ ఢిల్లీ వెళ్ళడం వెనుక గుసగుసలు కూడా వినిపించకపోవడంలేదు. ఆయనకు సంబంధించిన టీవీ చానెల్లో ప్రసారమైన ఓ ఇంటర్వ్యూపై సీబీఐ రేపిన అభ్యంతరం నేపథ్యంలో తనకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి ఆయన ఢిల్లీ యాత్రను ఫిరాయింపు అస్త్రానికి వాడుకుంటున్నారని జగన్ వ్యతిరేకులు ఇప్పటికే రాళ్లు విసిరేశారు.
1980 దశకంలో ఫిరాయింపుల నిరోధక చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేసినప్పుడు అంతా ఎంతో సంతోషించారు. ఒక పార్టీలో నెగ్గి, మరో పార్టీలోకి దూకేసి, ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. ఏళ్ళు గడిచే కొద్దీ చట్ట సభ్యులు కూడా లొసుగులను కనిపెట్టేశారు. హర్యానాలో భజన్‌లాల్ తన మంత్రివర్గంతో కలిసి, కాంగ్రెస్‌లో కలిసిపోయి, తొలిసారి ఆ చట్టానికి తూట్లు పొడిచేశారు. అది మొదలు ఏదో రూపంలో ఎమ్మెల్యేల వలసలు సాగిపోతూనే ఉన్నాయి. ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడిన తెలుగు దేశం పార్టీయే ప్రస్తుతం ఆ పనికి నిస్సిగ్గుగా పూనుకుంది. అవసరం లేకున్నా చేసిన ఈ పనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెరవలేదు. అక్కడితో ఆగిపోకుండా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టింది. ఈ అంశంపై ఎన్నో రకాలుగా సొంత పార్టీ సభ్యుల నుంచి సైతం నిరసన గళం వినిపించినా వెనుకడుగేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు తెలిసిన క్రమశిక్షణ అస్త్రాన్ని ప్రయోగించారు. కొంతమందికి ప్రలోభాలను చూపారు. మొత్తం మీద ఆ అంకాన్ని సుఖాంతమైతే చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారొక అంశాన్ని గమనంలోకి తీసుకోలేదు. మంచి పేరు రావాలన్నా… చెడ్డ పేరు రావాలన్నా.. మన పేరు అందరిలో నానాలన్నా.. నలుగురు అవసరముంటుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారిలో తప్పని సరైన ఓ నలుగురిని ఎంపిక చేసుకుని చంద్రబాబు గారు పట్టాభిషేకం చేశారు. తనయుణ్ణి మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే విస్తరణ అంతవరకే పరిమితం చేస్తే బాగోదు. అలాగని ఎంతమందిని సంతృప్తి పరచగలరు. అందుకే ఆ నలుగురినీ అస్త్రంగా వాడుకున్నారు. ఆయన ఎంపిక చేసుకున్న ఆ నలుగురూ వచ్చే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీకి ఎటువంటి లాభాన్ని చేకూరుస్తారో కాలమే తేలుస్తుంది.