18వ లోక్‌సభతో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఇందుకు సంబంధించి శనివారం షెడ్యూల్ విడుదల కానుంది. ఈ దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌కు విభజన, ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 175, ఒరిస్సాలో 147, అరుణాచల్ ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగబోతున్నా యి. ఇటీవల మరణించిన, ఇతర కారణాలతో దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల్లోని సీట్లకు ఉప ఎన్నికలు ప్రకటించే అవకాశముంది. తెలంగాణలోని కంటోన్మెంట్ సీటుకు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
2019లో సార్వత్రిక ఎన్నికల కోసం మార్చి 10న ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి దాదాపు వారం రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలవుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 23న వెల్లడించారు. ఇందులో మొదటి దశలోనే తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈసారి కూడా తొలి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ముగించే అవకాశం ఉంది.