నెల్లూరు కోర్టులో దొంగతనం అంశం ఏపీలో రాజకీయ కలకలం రేపుతోంది. చోరీ అయిన కేసులోని సాక్ష్యాలు కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఖచ్చితంగా శిక్ష పడే కేసుగా భావిస్తూండటంతో ఎక్కువగా ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దొంగలు ఎక్కడైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ సాక్ష్యాలు తీసుకెళ్లడం ఏమిటన్న అనుమానం సహంజగానే వస్తుంది. వాటిని మటుకే తీసుకెళ్లి పనికి రాని వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లోనూ కలకలం రేపింది.
కాకాణిపై కేసును గతంలోనే వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని ఇప్పుడు దొంగతనం పేరుతో సాక్ష్యాలను మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగగడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు. వైసీపీ నేతలు న్యాయవ్యవస్థతో సైతం ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
మరో వైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు మాత్రం ఈ మొత్తం దొంగతనం విషయంలో కుట్ర ఉందని అంటున్నారు. మంత్రి అయిన తర్వాత సాక్ష్యాలను దొంగతనం చేయిస్తే అందరికీ ఆయనపైనే అనుమానం వస్తుందని అలా చేశారని అంటున్నారు. నెల్లూరు అంతర్గత రాజకీయాలు ఈ దొంగతనానికి కారణం అయ్యాయని వారంటున్నారు. ఈ విషయంలో పోలీసులు ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కోర్టులోనే దొంగతనం జరగడం అంటే పూర్తిగా శాంతిభద్రతలు ఫెయిలయినట్లేనని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అందరి అనుమానపు చూపులు వైసీపీ పైనే పడుతున్నాయి. దీనిపై వైసీపీ కానీ.. కాకాణి కానీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.