వైసీపీని ధిక్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని వీరు ముగ్గురూ ప్రకటించారు. వారి అనుచరులంతా.. లోకేష్ పాదయాత్రలో పాల్గొననున్నారు. శుక్రవారమే ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లపై పలువురు నేతలు ఆనంను కలిశారు.
ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. టీడీపీలోకి రమ్మంటూ లాంఛనంగా ఆహ్వానం పలికారు ఇప్పటికే కోటంరెడ్డి స్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో తనకు టిక్కెట్ ఇచ్చేది లేదన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని.. కానీ తానుటీడీపీలో చేరుతున్నాన్నారు. టీడీపీలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తాననిప ప్రకటించారు.
ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు నుంచి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో టీడీపీలో ఒక్క సారిగా ఊపు వచ్చినట్లయింది. నిజానికి వైసీపీలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మరో ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీలోకి వస్తామని కబురు పంపారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదని చెబుతున్నారు. నెల్లూరులో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఒక్కో జిల్లాలో ఎంట్రీ సమయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని .. టీడీపీ నేతలు అంటున్నారు.