ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌పై పెట్టిన తప్పుడు కేసుల్ని హైకోర్టు కొట్టి వేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారని తేల్చింది. ఇప్పుడు ఆ తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు సేఫ్‌గానే ఉంటారు. కానీ ఇంత కాలం బురద చల్లించుకుని.. మానసికంగా ఇబ్బంది పడిన కృష్ణకిషోర్ లాంటి వాళ్లకు న్యాయం ఎలా జరుగుతుంది ? ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేసిన వారిపై శిక్షలు వేసినప్పుడే న్యాయం జరుగుతుంది. మరోసారి అలా చేయడానికి వ్యవస్థలో అధికారం అనుభవించేవారు భయపడే స్థాయిలో ఆ శిక్షలు ఉండాల్సిన అవసరం ఉంది.
తప్పుడు కేసులతో కక్ష తీర్చుకున్న అధికార అహంకారం !
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు మత్రమే ఏకైక ఏజెండా ఉంది. తనపై అక్రమాస్తుల కేసుల్లో విచారణ జరిపిన వారిని శిక్షించి.. తనతో పాటు నిందితులుగా ఉన్న వారిని అందలం ఎక్కించారు సీఎం జగన్. ఇందు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. జాస్తి కృష్ణకిషోర్ ఏపీకి వచ్చిన వేల కోట్ల పెట్టుబడుల అంశంలో ఎంతో కష్టపడ్డారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవ గొప్పది. అలాంటిది.. జగతి కేసులో పన్ను చెల్లింపుల అవకతవకలు ప్రశ్నించారని ఆయనపై తప్పుడు కేసు పెట్టారు. ఆయనపై కేసులో ఎలాంటి ఆధారాల్లేవని తేలిపోయింది. ఇలా బాధలు పడింది జాస్తి మాత్రమే కాదు.. ఇంకా ఎంతో మంది ఉన్నారు.
కానిస్టేబుల్ నుంచి డీజీ ఏబీవీ వరకూ తప్పలేదు !
ప్రస్తుత ప్రభుత్వం పోలీసుల్నే టార్గెట్ చేసింది. కులం పేరుతో ఎంతో మందిని వేధించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పర్యటనను అడ్డుకున్నారని చాలా మంది పోలీసులపై ఇప్పటికీ కక్ష సాధిస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా వారి డ్యూటీ వారు చేస్తారు. తప్పుడు కేసులు పెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని బయట పెట్టడానికి అధికారం ఉంది. కానీ అలా చేయకుండా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ.. ఎంతో మంది అధికారులపై తప్పుడు కేసులు పెట్టారు. కనీస సాక్ష్యాలు లేకపోయినా.. న్యాయవ్యవస్థతోఎలా వ్యవహరిస్తే ఎంత ఆలస్యం చేయవచ్చో అలా చేస్తూ.. వేధిస్తున్నారు. అవన్నీ తప్పుడు కేసులుగా తేలిపోయే రోజులు వచ్చేశాయి.
రాజకీయ నేతలనూ వదల్లేదు !
రాజకీయాల్లో తప్పు చేయకుండా ఉండటం కష్టం. ఆ తప్పును పట్టుకోవడం ప్రబుత్వాలకు కష్టం కాదు. కానీ తప్పుల్ని పట్టుకోకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టేసే బురద చల్లేసే తెంపరితనం ఏపీలోనే ఉంది. అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాంలో రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనకు పైసా ప్రయోజనం కలిగినట్లుగా ఆధారం చూపించలేదు. అసలు స్కాం జరిగిందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలా ఎంతో మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఎవరిపైనా ఒక్క ఆధారం చూపించంలేదు. అసలు భూసేకరణే జరగని అమరావతి రింగ్ రోడ్ పైనా చంద్రబాబును ఏ వన్ గా చూపించి కేసు పెట్టారంటే.. ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
శిక్షలు పడితేనే ఈ తరహా పరిస్థితుల్లో మార్పు.. లేకపోతే మరింత దిగజారుడే!
తప్పుడు కేసులు పెట్టే వాళ్లపై విరుచుకుపడాలి. లేకపోతే ఇప్పుడు బాధితులుగా ఉన్న వారు రేపు అదికారంలోకి వస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది.. ” ఇఫ్ యు ఆర్ బ్యాడ్.. ఐయమ్ యువర్ డాడ్ ” అన్నట్లుగా చెలరేగిపోతారు. నువ్ చేసిన దానికి పదింతలు ఇస్తామని అదికారం చేతిలో పెట్టుకున్నవారు అనుకోకుండా ఉంటారా..? ఇలా చేయడం వల్ల వ్యవస్థ బలహీనం అయిపోతుంది. అరాచకానికి దారి తీస్తుంది. అందుకే ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దాల్సి ఉంది. తప్పుడు కేసులు పెట్టిన వారికి కొల్లేటరల్ శిక్షలు విధించాల్సి ఉంది.