సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకుని వెయ్యి రోజులు అయిందని.. ఆయన ప్రపంచంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన తర్వాత వైసీపీ నేతలందరూ.. అరెరె… అప్పుడే వెయ్యి రోజులయిందా.. ఒక్క రోజు ముందు తెలిస్తే ఏదో ఓ కార్యక్రమం చేసే వాళ్లం కదా అని అనుకోవడం ప్రారంభించారు.
వెయ్యి రోజులంటే ఓ రకంగా మైలురాయే. సంబరాలు చేసుకోవచ్చు కూడా. కానీ ప్రస్తుతం వైసీపీలో మైలురాళ్లు లెక్కలేసుకుని సంబరాలు చేసుకునేంత మూడ్ లేదు. వరుసగా ఎదురు దెబ్బలు తగులుగుతున్నాయి. మూడేళ్లలో సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పించి చేసిందేమీ లేదన్న అసంతృప్తి మాత్రమే కాదు పార్టీ నేతలు చేస్తున్న పనులకు కూడా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు . ఎమ్మెల్యేలదీ అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే అక్కడక్కడ అయినా సంబరాలు చేసేవారు.
అయితే వారికీ తేదీలు గుర్తు లేనట్లుగా ఉన్నాయి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీంను నడుపుతున్నారు కాబట్టి లెక్కలేసి.. విష్ చేయగలిగారు. తనకు ఎంత చిత్తశుద్ధి ఉందో చూపించుకున్నారు. కానీ వెయ్యి రోజుల పాలనలో నిజాయితీగా తాము ఏం చేశామో ఒక్క సారి రివ్యూ చేసుకుంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్లకు భవిష్యత్‌పై ఓ అవగాహన వచ్చే అవకాశం ఉంటుందని ఆ పార్టీలో కొంత మంది సూచనలు ఇస్తున్నారు.