తెలంగాణ నుంచి.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అక్కడి ప్రభుత్వ పెద్దలు .. టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్న వ్యవహారంలో నేరుగా ఓ పేరు బయటకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రేపల్లే నుంచి పోటీ చేస్తున్న అనగాని సత్యప్రసాద్ గౌడ్‌ను… పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు వచ్చినట్లు నేరుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. రేపల్లెలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు ఈ విషయం ప్రకటించారు. ఆ సమయంలో పక్కనే… సత్యప్రసాద్ పక్కనే ఉన్నారు. ఆస్తుల లిటిగేషన్లు పెట్టి.. వైసీపీలో చేరాలని.. లేకపోతే.. పోటీ నుంచి విరమించుకోవాలని… కొద్ది రోజులుగా.. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు టీడీపీ నేతల్ని బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఇలానే తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయని చెబుతున్నారు.
ఇప్పుడు నేరుగా .. ఎమ్మెల్యే పేరు చెప్పి మరీ చంద్రబాబు బెదిరింపుల గురించి వివరించారు. అనగాని సత్యప్రసాద్‌ను బెదిరించడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని.. టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణారావు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈయన జైలుకు వెళ్లడానికి కారణం.. వాన్ పిక్ భూములు. వాన్ పిక్ పోర్టు కోసం.. వేల ఎకరాలు కేటాయించారు. సీబీఐ కేసుల కారణంగా.. పోర్టు ఆగిపోయింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వస్తే.. ఆ కేసులను క్లియర్ చేయించి… వాన్ పిక్ పోర్టును తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అప్పగించాలనే ప్రణాళిక వేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని కోసమే రూ. వెయ్యి కోట్లను.. కేసీఆర్.. జగన్ కు ఇచ్చారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
జగన్ వాన్‌పిక్ సిటీని కేసీఆర్‌కి గిఫ్ట్ ఇస్తాడంట.. అని చంద్రబాబు మండి పడ్డారు. దానికి ప్రతిఫలంగా కేసీఆర్ వెయ్యి కోట్లు పంపించారని ఒక్కో ఓటును రూ.5 వేలకు కొంటామంటున్నారని.. ఏపీలో కేసీఆర్, జగన్ ఆటలు సాగనివ్వొద్దని చంద్రబాబు రేపల్లెలో పిలుపునిచ్చారు. వైసీపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. వైసీపీ వస్తే గల్లీకి ఒక రౌడీ తయారవుతారు.. రాబోయే రోజుల్లో ఎవరినీ బతకనివ్వరన్నారు. మొత్తానికి రేపల్లె ఎమ్మెల్యేకు బెదిరింపులు… వాన్ పిక్ పోర్టు కోణం కలసి రావడంత.. ఏపీ రాజకీయాల్లో.. తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.