తెలంగాణ బీజేపీలోనూ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల ఆ పార్టీలోని ఓ వర్గం నేతలు అరవై వరకూ అసెంబ్లీ స్థానాల్లో టిక్కెట్లను ారు నెలల ముందుగానే ప్రకటిస్తుందని చెప్పడం ప్రారంభించారు. దీంతో టిక్కెట్ల గురించి ఏమైనా చెప్పాలంటే తాను చెప్పాలి కానీ ఇతరులు చెప్పడం ఏమిటని బండి సంజయ్ ఫీలయ్యారు. వెంటనే ఇలా టిక్కెట్ల గురించి ప్రచారం చేసే వాళ్లకి టిక్కెట్లు ఇవ్వరని నేరుగా పార్టీ సమావేశాల్లోనే హెచ్చరించడం ప్రారంభించారు. తన టిక్కెట్కే గ్యారంటీ లేదని ఇక ఇతరులకు టిక్కెట్లు ఎలా వస్తాయని ఆయన చెబుతున్నారు.
ఇటీవల బీజేపీలో ఈటల రాజేందర్ తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా కొంత మంది నేతల్ని ప్రోత్సహిస్తూ వారికే టిక్కెట్ వస్తుందని చెప్పడం ప్రారంభించారు. అంతే కాక ఆరు నెలల ముందుగానే టిక్కెట్ల ప్రకటన ఉందని చెబుతున్నారు. ఇది బండి సంజయ్కు నచ్చడం లేదు. బండి సంజయ్ కూడా తన వర్గాన్ని విస్తృతంగా పెంచుకుంటున్నారు. కిషన్ రెడ్డిజాతీయ రాజకీయాల్లో ఉండటంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోలేకపోతున్నారు. కానీ స్థానికంగా .. బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ బండి సంజయ్.. కొంత మందిని ఖరారు చేసి నియోజకవర్గాలకు పంపుతున్నారు.
ఆయన వర్గం ఇప్పటికే యాభై, అరవై సీట్లలో అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బండి సంజయ్ ఎక్కడకు వెళ్తే అక్కడకు మందీ మార్బలంతో వెళ్తున్నారు . ఈ పరిణామాలతో బీజేపీలోని ఇతర సీనియర్ నేతలు కూడా తామేం తక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను గుంభనంగా ఇచ్చే టిక్కెట్ల హామీ విషయంలో బండి సంజయ్ దూకుడుగానే ఉన్నా.. ఇతర నేతలు ఇస్తున్న హామీలను మాత్రం మధ్యలోనే కొట్టేస్తున్నారు. బీజేపీలో అంతర్గత రాజకీయం ముదిరిపాకాన పడుతోందన్న అభిప్రాయానికి. .. బండి సంజయ్ సొంత పార్టీ నేతలపై తరచూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు.