హారర్ కామెడీని సినిమా అంటే విసుగొచ్చేంతలా…. ఈ జోనర్‌ని వాడేసుకొన్నారు సినిమా వాళ్లు. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి సినిమాలు హిట్టవ్వడంతో – మిగిలిన సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ దక్కడంతో ఈ జోనర్పై పడ్డారంతా. మొదట్లో తక్కువ బడ్జెట్‌కి పూర్తి చేసి, లాభాలు గడించి నిర్మాతలకు `ఓకే` అనిపించింది. ప్రేక్షకులకూ ఈ జోనర్ కొత్తగా కనిపించింది. అయితే రాన్రాను అవే కథలో విసుగు తెప్పించేశారు. బడా హీరోలు సైతం హారర్‌పై మోజు పడ్డారు. కానీ లాభం లేకపోతోంది. చివరి 20 – 30 హారర్ సినిమాల్లో హిట్ అయ్యింది ఒకటో అరో ఉన్నాయంతే. తాజాగా విడుదలైన నెక్ట్స్ నువ్వే కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక్కడితో ఈ ప్రహసనం ఆగడం లేదు. రాబోయే రోజుల్లో కూడా హారర్ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ఈవారంలో విడుదల అవుతున్న సిద్దార్థ్ సినిమా `గృహం` కూడా హారర్ కథే. `దేవిశ్రీ ప్రసాద్` అనే మరో దెయ్యం కథ విడుదలకు సిద్ధంగా ఉంది.
బడ్జెట్ పరంగా చూస్తే… ఈ జోనర్‌కి నష్టభయం చాలా తక్కువ. సినిమా ఎలా ఉన్నా – ఫ్లాప్ అయినా తక్కువ నష్టానికి గట్టెక్కొచ్చు. హిట్ కొడితే, కాసుల పంటే. కాకపోతే కథల విషయంలో వైవిధ్యం లేకపోవడంతో ఈ సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. ఒక ఇంట్లో దెయ్యాన్ని చూపించడం, అక్కడో కామెడీ గ్యాంగ్ చేరడం, ఆ దెయ్యం ఈ గ్యాంగ్‌తో ఆటాడుకోవడం…. ఇంతకు మించిన కథేం కనిపించడం లేదు. ట్విస్టులు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లూ షరా మామూలే. పైగా హారర్ సినిమాల్లో కామెడీ ఎక్కువై హారర్ తగ్గడం `దెయ్యం సినిమా` ప్రియుల్ని మరింతగా బాధిస్తోంది. టెక్నికల్ పరంగానూ ఈ సినిమాలేం గొప్పగా తీయడం లేదు. బడ్జెట్ తక్కువ కాబట్టి.. ఉన్నంతలో చుట్టేస్తున్నారు. అందుకే.. హారర్ కామెడీ అంటే జనాలకు మోజు తగ్గిపోయింది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు గ్రహించాలి. లేదంటే సరికొత్త కథలతో ప్రేక్షకుల్ని షాక్‌కి గురి చేయాలి. ఇవి రెండూ కుదరకపోతే, హారర్ కామెడీ అనే జోనర్ చూడ్డానికి థియేటర్లో ఒక్క ప్రేక్షకుడూ కనిపించడు.