తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు… జనసేన పార్టీలో చేరారు. వెంటనే ఆయనను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు పవన్ కల్యాణ్. మేధావుల పేరుతో చాలా మందిని పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకుంటున్నారు.. అందులో విశేషం ఏమీ లేదు కానీ.. ఈ రామ్మోహన్ రావును చేర్చుకుని.. వెంటనే పదవి ఇప్పగించడంలో మాత్రం.. చాలా పెద్ద విశేషం ఉంది. అది పవన్ కల్యాణ్ .. విశ్వసనీయతను ప్రశ్నించాల్సిన విషయం.
పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం.. శేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై విమర్శలు చేశారు. ఆయన ఓ పెద్ద దొంగ… ఆయనతో లోకేష్‌కు సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆధారాలు అడిగితే.. అందరూ అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కానీ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడు అనే అంశంలో మాత్రం క్లారిటీ ఉంది. అందుకే అతనితో లోకేష్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ శేఖర్ రెడ్డి వ్యవహారం తమిళనాడులో కలకలం రేపింది. నోట్ల రద్దు జరిగినప్పుడు… అసలు నోట్లే దొరకని రోజుల్లో.. ఆ శేఖర్ రెడ్డి ఇంట్లో.. వందల కోట్లు కొత్త నోట్లు పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనమే. అసలు .. దీని వెనుక కథేమిటో బయటకు రాలేదు. కానీ.. ఆయన పట్టుబడిన తర్వాత ఆ కేసు మొత్తం… ఈ రామ్మోహన్ రావు చుట్టూనే తిరిగింది. ఆ శేఖర్ రెడ్డి.. రామ్మోహన్ రావుకి బాగా దగ్గర. అన్నాడీఎంకే నేతలకు.. అత్యంత దగ్గరయిన శేఖర్ రెడ్డి.. అప్పట్లో.. సీఎస్‌గా ఉన్న రామ్మోహన్ రావు ద్వారానే పనులు చక్కబెట్టుకున్నారు. వారిద్దరికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరిపై ఒకే సారి సీబీఐ దాడులు చేసింది. సీబీఐ అధికారులు.. ఈ రామ్మోహన్ రావు , ఆయన కుమారుడు ఇంటిపై దాడులు చేశారు. పెద్ద మొత్తంలో ఆస్తులు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ శేఖర్ రెడ్డి..ఈ రామ్మోహన్ రావుకి బినామీ అనే అనుమానం సీబీఐ అధికారులు వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో.. ఆయన చక్కబెట్టిన వ్యవహారాలపై ఇప్పటికీ తమిళనాడులో కథలుకథలుగా చెప్పుకుంటారు. బీజేపీతో అన్నాడీఎంకే రాజీపడిపోయింది కాబట్టి.. ఆయన వ్యవహారాలు మరుగునపడిపోయాయి. లేకపోతే.. ఇప్పటికీ.. సీబీఐ రామ్మోహన్ రావు ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండేదని..తమిళనాడులో చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి మాజీ బ్యూరోక్రాట్ వచ్చి జనసేనలో చేరిపోయారు. పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. మరి పవన్ కల్యాణ్ చెప్పే ఆదర్శాలకు… అవినీతిలో.. తాను చెప్పిన శేఖర్ రెడ్డిని బినామీగా పెట్టుకున్న రామ్మోహన్ రావును పవన్ కల్యాణ్.. ఎలా పార్టీలో చేర్చుకున్నారు. తన పక్కనే ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు. పవన్ ఆదర్శం ఇదేనా..