ఈమధ్య రీమేకుల హడావుడి బాగా తగ్గిపోయింది. పాన్ ఇండియా సినిమాల ప్రభావం వల్ల, ప్రతీ సినిమా అన్ని భాషల్లోనూ వచ్చేస్తోంది. ఓటీటీ పుణ్యాన సబ్ టైటిళ్లతో సంబంధం లేకుండా, డబ్బింగ్ వెర్షన్లే చూసేస్తున్నారంతా. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ రీమేక్ అనే మాట అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘కిల్’ రీమేక్ గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న యాక్షన్ డ్రామా కిల్. కరణ్ జోహార్ నిర్మాతగా తీసిన సినిమా ఇది. తొలుత ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్ తో సూపర్ హిట్ అయిపోయింది. యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడంతో యూత్ కి బాగా నచ్చింది. అందుకే ఇప్పుడు రీమేక్ రైట్స్ కోసం పోటీ ఎక్కువైంది. తెలుగు నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘కిల్’ రీమేక్ రైట్స్ చేజిక్కించుకోవాలని పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ సురేష్ బాబు కూడా కర్చీఫ్ వేశారని తెలుస్తోంది. ఆయన రానాతో ఈ సినిమా తెరకెక్కించాలని చూస్తున్నారు. వరుణ్‌తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, విశ్వక్సేన్.. వీళ్లతో ఒకరితో ఈ రీమేక్ తెరకెక్కించాలని నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వారంలో రీమేక్ రైట్స్ విషయం తేలిపోతుంది. ఆ తరవాత హీరో ఎవరన్నది తెలుస్తుంది. సదరు హీరోలు కూడా ఈ ఆఫర్ తమదాకా వస్తే ఓకే చేద్దామని ఎదురు చూస్తున్నారు. ఒకరిద్దరు యంగ్ హీరోలు స్వయంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ సంపాదించాలని ఎంక్వైరీలు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఉంది ‘కిల్’ డిమాండ్. మరి ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో చూడాలి.