రేపే.. జగన్తో టాలీవుడ్ పెద్దలు భేటీ వేయబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సమావేశంలో చిరంజీవితో పాటుగా నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ లాంటి స్టార్ హీరోలూ పాల్గొన బోతున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంతో.. అటు ప్రభుత్వానికీ, ఇటు చిత్రసీమకూ మధ్య ఉన్న గ్యాప్ తేలిపోతుందన్న భరోసా కలుగుతోంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా టాలీవుడ్ కి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న సంకేతాలు అందుతున్నాయి.
టికెట్ రేట్లు తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సమస్య మొదలైంది. ఇప్పుడు ఆ జీవోని సవరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. అలాగని మరీ పెద్ద సినిమాకి గేట్లు ఎత్తేయకుండా..మినిమం – మాక్సిమం రేట్లు ఎంతుండాలో నిర్ణయించబోతోందని సమాచారం. ఆ రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాల్సి ఉంటుంది. బీ,సీ సెంటర్లలో టికెట్ రేట్లు మరీ తక్కువ ఉన్నాయి. ఆ రేట్లు పూర్తిగా సవరించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు… బెనిఫిట్ షోకి సైతం అనుమతులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతుండాలి అనే విషయంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. టికెట్ రేట్ల గురించి ఇప్పటికే టాలీవుడ్ కీ , ప్రభుత్వానికీ మధ్య ఓ అవగాహన కుదిరిందని, ఇప్పుడు అందరూ కూర్చుని `ఓకే` అనుకోవడమే తరువాయి అని సమాచారం.
చాలా ఏళ్లుగా `నంది` పురస్కారాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అవార్డుల గురించి ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022లోనే పెండింగ్లో ఉన్న అవార్డులన్నీ ప్రకటించేస్తారని, అవన్నీ క్లియర్ చేసే దిశగా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని సమాచారం.