‘కల్కి’ తర్వాత మళ్ళీ బాక్సాఫీసు డీలా పడింది. ఫుట్ ఫాల్ వున్న సినిమా ఒక్కటీ రాలేదు. జూలై మరీ వీక్ గా తయారైయింది. ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర సత్తా చాటలేకపోయింది. జూలైలో వచ్చిన పెద్ద సినిమా భారతీయుడు 2. చాలా కాలం ప్రొడక్షన్ లోనే వుండిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు జులై 12న వచ్చింది. సినిమా చూసిన జనాలు పెదవి విరిచారు. ఇదేం కంటెంట్ అని తలలు పట్టుకున్నారు.
కమల్ హసన్ సినిమా అంటే బాక్సాఫీసు మాట అటుస్తే.. ఆయన సినిమాలు విమర్శకుల మెప్పుపొందుతుంటాయి. కానీ భారతీయుడు 2 ఆ లెక్క కూడా తప్పింది. కథ, కథనాలు ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. టోటల్ సినిమా డిజాస్టర్.
హనుమాన్ లాంటి పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ప్రియదర్శి హీరో డార్లింగ్ సినిమా జులై 19న వచ్చింది. సినిమాకి మంచి పబ్లిసిటీ చేశారు. అయితే సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది, కామెడీ వర్క్ అవుట్ కాలేదు. ఎమోషన్ పండలేదు. తొలి ఆటతోనే సినిమా భవిష్యత్ తేలిపోయింది.
Also Read : ఓటీటీ పులి మీద… టాలీవుడ్ సవారీ
పేకమేడలు అనే చిన్న సినిమా వినూత్నమైన ప్రచారంతో ద్రుష్టిని ఆకర్షించింది, వినోద్ కిషన్ ప్రధాన పాత్రలో మధ్యతరగతి నేపధ్యంలో రూపొందిన సినిమా ఇది. తెలిసిన కథే అయినప్పటికీ నేచురల్ ట్రీట్మెంట్ తో సినిమాని తీశారు. అయితే ఇందులో క్రౌడ్ పుల్లింగ్ స్టార్స్ లేకపోవడంతో ఫోకస్ అవుట్ అయిపొయింది.
డబ్బింగ్ సినిమాగా వచ్చింది రాయన్. ధనుష్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ చేశాడు. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. సందీప్ కిషన్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. రెహ్మాన్ బీజీఎం కూడా మెరిసింది. అయితే సినిమాకి తగినంత పబ్లిసిటీ లేదు. దీంతో జనాల ద్రుష్టిని ఆకర్షించలేకపోయింది రాయన్.
రాజ్ తరుణ్ పురుషోత్తముడు, కొత్తకుర్రాళ్ళు కలసి చేసిన బర్త్ డే బాయ్, రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్ తో పాటు వచ్చిన మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.