షూటింగ్ లో తమ అభిమాన హీరోని చూడటానికి ట్రాక్టర్లు కట్టుకొని జనాలు వచ్చేవారు. అభిమానులను కంట్రోల్ చేస్తూనే రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరపడానికే మొగ్గు చూపేవారు హీరోలు. అయితే ఇప్పుడిదంతా చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అనగనగా అవుట్ డోర్ షూటింగ్ అని చెప్పే స్థితి దాపురించింది.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఈ తరం హీరోలు అవుట్ డోర్ అంటే ఆసక్తిని కనబరిచేవారు. అభిమానుల తాకిడి వునప్పటికీ కథని ద్రుష్టిలో పెట్టుకొని అవుట్ డోర్ కి సై కొట్టేవారు. ఈ విషయంలో బాలయ్య ముందుటారు. ఎక్కడ షూటింగ్ అన్నా మరో ఆలోచన లేకుండా వెళ్ళడానికి సిద్ధమౌతారు. ఆయన గత చిత్రం వీరసింహారెడ్డిలో ఊరేగింపు సీన్లు అన్నీ రియల్ గా సీమలో అభిమానులు మధ్య చిత్రీకరించినవే. చిరుకి కూడా అవుట్ డోర్ లు అంటే ఆసక్తి. షూటింగ్ తో పాటు అభిమానులని కలిసొచ్చినట్లువుందనే ఉత్సాహంతో అవుట్ డోర్ లో పాల్గొంటారు.
అయితే ఇప్పుడు జమానా మారింది. ఒకే లొకేషన్ లో సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేయగల కథలు వుంటేనే ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది హీరోలు. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు అవుట్ అంటే ఆసక్తి చూపడం లేదు.
బాహుబలి నుంచి మొన్న వచ్చిన కల్కి వరకూ ప్రభాస్ సినిమాలు గమనిస్తే.. దాదాపు సెట్స్ లో ఫినిష్ చేసినవే వుంటాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, లేదా హైదరాబాద్ శివార్లో భారీ సెట్లు వేసి అక్కడే సినిమా పూర్తయ్యేలా చూసుకుంటున్నారు. మహేష్ కూడా అంతే. ఆయన సినిమాలు దాదాపు సెట్స్ లోనే వుంటాయి. సాంగ్స్ కోసం ఫారిన్ వెళ్ళడానికి మొగ్గుచుపుతారేమో కానీ ఇక్కడ అవుట్ డోర్ అంటే అస్సల్ ఆసక్తి కనబరచారు.
మహేష్ ఇన్ డోర్ కి ఎంతలా అలవాటు పడ్డారంటే.. మహర్షి సినిమాలో బీడు భూమి- రైతు సీన్ వుంటుంది. ప్రొడక్షన్ టీం కష్టపడి అలాంటి లొకేషన్ ని పట్టుకున్నారు. అక్కడి వెళ్ళాలంటే కొంత దూరం ట్రావెల్ చేయాలి. ఈ ట్రావెలింగ్ ఎందుకని ఆ సీన్ కూడా సిజీ లో చేయించేశారు. ఇలా చెప్పుకుంటే చాలా వుంటాయి. ఇప్పుడు చాలా మంది హీరోల ప్రయారిటీ ఇన్ డోర్ స్టూడియోలు, బ్లూ మ్యాట్ లే. పెరిగిన టెక్నాలజీని ఈ రకంగా వాడుకుంటున్నారు.
అవుట్ డోర్ లేకపోవడం వలన వచ్చే ఇబ్బంది ఏమిటని అడగొచ్చు. దీనికి వలన నిర్మాత, దర్శకుడికే ఇబ్బంది. అవుట్ డోర్ లో ఓ సీన్ తీస్తే ఓ రోజులో కంప్లీట్ అయిపోతుంది. అదే సిజీకి ఇస్తే సదరు కంపెనీ వాడు ఏదిస్తే అదే అవుట్ పుట్. డైరెక్టర్ చేతిలో ఏమీ వుండదు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా సిజీని ఈజీగా పట్టేస్తున్నారు. కంప్లీట్ రియల్ లా చేయాలంటే మంచి పేరున్న కంపెనీకి ఇవ్వాలి. అక్కడ బడ్జెట్ పెరిగిపోతుంది.
ఇక దర్శకుల విషయానికి వస్తే కథలు రాసుకోవడం పరిధులు వచ్చేస్తాయి. రాస్తున్నపుడే లొకేషన్ గురించి అలోచించే పరిస్థితి వస్తుంది. క్రియేటివిటీకి అదొక అవరోధమే. పైగా ప్రభాస్ లాంటి హీరోలు కేవలం సెట్స్ లో పూర్తయ్యే కథలపై ఆసక్తి చూపిస్తున్నారని, అలాంటి కథలే వింటున్నారని, ప్రస్తుతం సెట్స్ మీద వున్న రాజాసాబ్ అలాంటి ప్రయారిటీతోనే పట్టాలెక్కిందని టాక్. ఏదేమైనా మారుతున్న హీరోల అభిరుచుల కారణంగా అవుట్ డోర్ షూటింగులు మసకబారాయి.