ఐపీఎల్, ఎలక్షన్ల పుణ్యమా అని… వేసవిలో ‘క్లీన్ బౌల్డ్’ అయిపోయింది టాలీవుడ్. మార్చి, ఏప్రిల్, మేలలో ఒకటీ అరా విజయాలే దక్కాయి. మే మొత్తం ఒక్క హిట్టు పడలేదు. ఈ ఫలితాలు నిర్మాతల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ‘రాంగ్ టైమ్’ అంటూ నిట్టూర్చడం తప్ప ఇప్పుడు చేసేదేం లేదు. ఐపీఎల్ అయిపోయింది. జూన్ 4తో రాజకీయ వేడి తగ్గుతుంది. ఆ తరవాత అంతా సినిమాల మయమే. అందుకే జూన్‌పై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకొంది. ఇదే నెలలో ‘కల్కి’ విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించగల సత్తా ఉన్న సినిమా ఇది. ఇండియన్ బాక్సాఫీసుని సైతం షేక్ చేసే స్థాయి ఉన్న ప్రాజెక్ట్ ఇది. అందుకే జూన్ పై టాలీవుడ్ ఆశలు పెట్టుకొంది.
జూన్ 7న బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాల జోరు కనిపిస్తోంది. శర్వానంద్ సినిమా `మనమే` ఈవారమే వస్తోంది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ట్రైలర్, టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ `మనమే` పై దృష్టి పెట్టే ఛాన్స్ వుంది. ఇదేవారంలో కాజల్ ‘సత్యభామ’ నవదీప్ ‘లవ్ మౌళి’, పాయల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. సో.. ఈ వారం కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడడం ఖాయం. ఈనెల 14న సుధీర్‌బాబు ‘హరోం హర’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి మే 31న రావాల్సిన సినిమా ఇది. అదే రోజున 3 సినిమాలు రావడం వల్ల.. జూన్ 14కు వాయిదా పడింది. అదే మంచిదైంది. తెలుగు ప్రజలు ఇంకా పొలిటికల్ హీట్‌లోనే ఊగుతున్నారు. 14 అంటే వాతావరణం పూర్తిగా చల్లబడుతుంది. అందుకే టీమ్ ఈ నిర్ణయం తీసుకొంది.
ఇక ఈనెలాఖరున కల్కి వస్తోంది. ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబోలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రమిది. అమితాబ్‌బచ్చన్, కమల్ హాసన్ లాంటి ఉద్దండులు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు. ‘బుజ్జి’ పేరుతో ఓ వాహనాన్ని తయారు చేశారు. అదే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇండియన్ రికార్డుల్ని తిరగరాసే సత్తా ఈ సినిమాకు ఉందని టాలీవుడ్ నమ్ముతోంది. అదే నిజమైతే ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత మరోసారి తెలుగు సినిమా జెండా రెపరెపలాడడం ఖాయం. మొత్తానికి జూన్‌పై గట్టి నమ్మకంతో ఉంది టాలీవుడ్. మరి ఆ ఆశలు, అంచనాలూ ఏమవుతాయో చూడాలి.