ఏంటో ఈమధ్య.. బాక్సాఫీసుకు చిన్న సినిమాలే జోష్ తీసుకొస్తున్నాయి. గత నెలలో ‘కమిటీ కుర్రాళ్లు’, ‘ఆయ్’ మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ విడుదలకు ముందు కాస్త సందడి చేయగలిగింది. ఈరోజు విడుదలైన ’35’కు మంచి స్పందన వస్తోంది. రివ్యూలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇదే జోష్ లో ఈనెలలో మరికొన్ని చిన్న సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.
శనివారం ‘ఉరుకు పటేలా’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వచ్చేవారం ‘ధూమ్ ధామ్’, ‘భలే ఉన్నాడే’, ‘మత్తు వదలరా 2’, ‘ఉత్సవం’, ‘కళింగ’, ‘హైడ్ అండ్ సిక్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం రావాల్సిన ‘జనక అయితే గనక’ వర్షాల కారణంగా వాయిదా పడింది. ఆ చిత్రాన్ని వచ్చే వారం రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ‘మత్తు వదలరా 2’పై ప్రేక్షకులకు గురి ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు వెరైటీగా చేస్తున్నారు. రాజ్ తరుణ్ సినిమా ‘భలే ఉన్నాడే’పై మారుతి బ్రాండ్ ఉంది. మారుతి ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ. కాబట్టి దీనిపై కూడా ఫోకస్ పెట్టొచ్చు.
ఈనెల 27న ఎన్టీఆర్ ‘దేవర’ విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘దేవర’కు ఓ వారం ముందూ, ఓ వారం తరవాత సినిమాలేం రావడం లేదు. కాబట్టి… ‘దేవర’కు మంచి టైమ్ దొరికినట్టే. అంతకంటే ముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చిన్న నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇన్ని సినిమాలు వరుస కట్టేస్తున్నాయి.