కొత్త క్యాలెండర్ లో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. సంక్రాంతి సినిమాల గురించి నిన్నో మొన్నో మాట్లాడుకొన్నట్టు అనిపించింది.తిరిగి చూస్తే… వేసవి సీజన్ కూడా మొదలైపోయింది. మూడు నెలల్లో గంప గుత్తగా సినిమాలొచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతీ నెలలోనూ పెద్ద సినిమాలు ఒకటో రెండో తప్పకుండా కనిపించాయి. అయితే.. ఆశించిన స్థాయిలో విజయాలు వచ్చాయా? అంటే సంతృప్తికరమైన సమాధానం రాదు. ఈ క్వార్టర్లీ రిపోర్ట్ ఒక్కసారి చెక్ చేస్తే…!
జనవరి అంతా సంక్రాంతి సినిమాలదే హవా. ఈసారి బరిలో చిరంజీవి, బాలకృష్ణ బరిలో ఉండడంతో వీరి సినిమాల గురించే ఎక్కువ చర్చ జరిగింది. అజిత్ (తెగింపు)ని ఎవరూ పట్టించుకోలేదు. విజయ్ వారసుడు బొటాబొటీ విజయాన్ని అందుకొంది. వాల్తేరు వీరయ్య చిరు కెరీర్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకొంది. దాంతో పోలిస్తే వీర సింహారెడ్డి వసూళ్లు తక్కువే అయినా, ఈ సంక్రాంతికి కావల్సిన జోష్ అందించగలిగింది. ఈ రెండు సినిమాలతో సంక్రాంతి సీజన్ హ్యాపీగానే గడిచిపోయింది. బాలీవుడ్ నుంచి వచ్చిన `పఠాన్` కాస్తో కూస్తో కలక్షన్లని రాబట్టింది. సుధీర్ బాబు `హంట్` డిజాస్టర్‌గా మిగిలింది.
ఫిబ్రవరిలో చాలా సినిమాలు వచ్చాయి. పద్మభూషణ్, బుట్టబొమ్మ, మైఖేల్ ఒకే రోజు విడుదలయ్యాయి. పద్మభూషన్ ఓకే అనిపించుకొంది. మిగిలిన రెండూ డిజాస్టర్లే. ఫిబ్రవరి 10న వచ్చిన `అమిగోస్` కూడా ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. ఈ నెలలో కాస్త ఊపిరి పోసిన సినిమా `సార్` మాత్రమే. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. రెవిన్యూ కూడా బాగానే లభించింది. ధనుష్ తెలుగులో చేసిన తొలి సినిమా ఇది. ఓ హిట్ తో… ధనుష్ బోణీ కొట్టినట్టైంది. వినరో భాగ్యము విష్ణు కథ బిలో యావరేజ్ రేంజ్ దగ్గరే ఆగిపోయింది. ఫిబ్రవరి చివరి వారంలో 10 సినిమాల వరకూ వచ్చాయి. కానీ.. అన్నీ ఫ్లాపులే.
మార్చిలో విడుదలైన చిత్రాల్లో `బలగం` ఒకటి. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఈ సినిమాతో వేణు దర్శఖుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే తెలంగాణ మట్టి వాసన గుభాళించాడు. ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి వసూళ్లూ వచ్చాయి. కృష్ణవంశీ `రంగమార్తాండ` క్లాస్ సినిమా అనిపించుకొన్నా.. కాసులు మాత్రం రాలేదు. దాస్ కా దమ్కీ, ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి.. రెండూ ఫ్లాపులే. చివరి వారంలో విడుదలైన `దసరా`తో మళ్లీ టాలీవుడ్ ఊపిరి పీల్చుకొంది. ఈ నెలలో.. ఇదే పెద్ద హిట్. నాని కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు తెచ్చుకొనే అవకాశం ఉంది. వంద కోట్ల మైలు రాయి దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా. ఈ మూడు నెలలూ అరకొర విజయాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.
అయితే రాబోయేది కీలకమైన వేసవి సీజన్. పిల్లలకు పరీక్షలు అయిపోయాయి. వాళ్లకు కావల్సినంత ఖాళీ టైమ్దొరికింది. థియేటర్లో మంచి సినిమాలు రాబోతున్నాయి.ఈ సీజన్లో కనీసం 20 నుంచి 30 చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. అందులో నాలుగైదు హిట్లు పడితే… బాక్సాఫీసుకి మరింత జోష్ వస్తుంది. మరి ఈ వేసవి జాతకం ఎలా ఉందో చూడాలి.