క్యాలెండర్లో మూడు నెలలు రీళ్ళు తిరిగినట్లు గిర్రున తిరిగేశాయి. ఈ యేడాదిలో అప్పుడే మూడు నెలలు గడిచిపోయాయి. ఈ 90 రోజుల్లో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు వచ్చాయి. ఇందులో విజయాలు, పరాజయాలు ఉన్నాయి. తీవ్రంగా నిరాశపరిచిన చిత్రాలు వున్నాయి. ఒక్కసారి టాలీవుడ్ క్వార్టర్లీ రిపోర్ట్ ను పరిశీలిస్తే…
జనవరి మొదటి వారంలో వచ్చిన ‘సర్కారు నౌకరి’, ‘ప్రేమకథ’, ‘రాఘవ రెడ్డి’, ‘డబుల్ ఇంజిన్’..ఇలా చిన్న సినిమాలు ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. అయితే పండగ సినిమాలతో అసలైన సినిమా సందడి రెండో వారంలో మొదలైయింది. జనవరి 12న మహేశ్‌బాబు – త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’, తేజ సజ్జా – ప్రశాంత్ వర్మల ‘హను-మాన్’ ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హనుమాన్ కి చాలా తక్కువ థియేటర్స్ దొరికాయి. అయితే కంటెంట్ పై నమ్మకంతో మహేష్ సినిమాతో పాటే వచ్చింది హనుమాన్. వారి నమ్మకం నిజమైయింది. హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాకి వస్తున్న ఆదరణతో క్రమంగా థియేటర్స్ పెరిగాయి. దాదాపు రూ.330కోట్ల పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది హనుమాన్.
మహేష్ బాబు గుంటూరు కారం ఈ ఏడాది తీవ్రంగా నిరాశపరిచిన చిత్రాల జాబితాలోకి వెళ్ళింది. మహేష్ త్రివిక్రమ్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ ఆ అంచనాలని అందుకోలేకపోయింది గుంటూరు కారం కంటెంట్. అసలు ఇది మహేష్ ఇమేజ్ కి సరిపడా కథ కాదని స్వయంగా మహేష్ బాబు అభిమానులే పెదవి విరిచారు. మహేష్ స్టార్ డమ్ తో మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ తర్వాత బాక్సాఫీసు వద్ద నిలబడలేకపోయింది.
జనవరి13న వెంకటేశ్ ‘సైంధవ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పండగ సినిమాల్లో సైంధవ్ సింక్ అవ్వలేదు. ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులు అస్సలు పట్టలేదు. ఫలితంగా వెంకీ ఖాతాలో ఓ ఫ్లాఫ్ పడింది. జనవరి 14న ‘నా సామిరంగ’తో ప్రేక్షకులని పలకరించారు నాగార్జున. కంటెంట్ కొత్తది కానప్పటికీ సంక్రాంతి వాతావరణంతో నిండిన ఈ సినిమాకి పంగడ సీజన్ కలిసొచ్చింది. లాభాలు రాలేదు కానీ నష్టం జరగలేదని ట్రేడ్ రిపోర్ట్స్ వచ్చాయి. సంక్రాంతి సినిమాల తర్వాత రెండు వారాలు కొత్త సినిమాల సందడి కనిపించలేదు. డబ్బింగ్ సినిమా గా వచ్చిన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ ను ప్రేక్షకులు పట్టించుకోలేదు.
ఫిబ్రవరి మొదటి వారంలో `అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘కిస్మత్’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘బూట్‌కట్ బాలరాజు’ సినిమాలు వచ్చాయి. ఇందులో సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు తప్పితే మరో సినిమా ప్రేక్షకులని దృష్టిని ఆకర్షించలేకపోయింది. అంబాజీపేటకి డీసెంట్ రివ్యూలు వచ్చాయి కానీ కలెక్షన్స్ లేవు. పండక్కి రావాల్సిన రవితేజ ‘ఈగిల్’ ఫెబ్రవరి రెండో వారంలో వచ్చింది. టేకింగ్ పరంగా బావుందని అనిపించిన ఈ సినిమా బాక్సాఫీసు ముందు మాత్రం నిలబడలేకపోయింది. అదే వారంలో వచ్చిన డబ్బింగ్ సినిమా రజనీకాంత్ ‘లాల్ సలాం’ డిజాస్టర్ అయ్యింది. సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో వచ్చారు. గతంలో వచ్చిన సందీప్ కిషన్ సినిమాలతో పోల్చుకుంటే భైరవ కోన కొంచెం బెటర్. కానీ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం రాలేదు. ఫెబ్రవరి మూడో వారంలో ‘రాజధాని ఫైల్స్’, ‘సిద్ధార్థ్ రాయ్’ లాంటి చిన్న సినిమాలతో పాటు మమ్ముటి ‘భ్రమయుగం’ విడుదలయ్యాయి. ఇందులో భ్రమయుగంకు మంచి స్పందన వచ్చింది.
మార్చి తొలి వారం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’తో పాటు ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, ‘చారి 111’, తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇందులో ఒక్క సినిమా కూడా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. మంచి అంచనాలు వున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ కూడా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత గోపీచంద్ ‘భీమా’, విష్వక్ సేన్ ‘గామి’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గామి డిఫరెంట్ సినిమా అనే టాక్ తెచ్చుకుంటే భీమా మాత్రం రొటీన్ అనే ముద్రవేసుకుంది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు పై పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. అదే వారంలో వచ్చిన మలయాళం డబ్బింగ్ ‘ప్రేమలు’ సినిమా మాత్రం ప్రేక్షకులని విశేషంగా అలరించింది. రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్ మారి ఈ సినిమాతో మంచి లాభాలు చేశారు. మార్చి మూడో వారంలో ‘రజాకార్’, ‘లంబసింగి’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘వెయ్ దరువెయ్’.. లాంటి చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఒక్కసినిమాకి హిట్ టాక్ రాలేదు.
శ్రీవిష్ణు ఈ ఏడాది అప్పుడే ఓ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ‘ఓం భీమ్ బుష్’తో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి చేసిన ఈ కామెడీ హారర్ ప్రేక్షకులని అలరించింది. లాభాలు కూడా చూసింది. మార్చిలో మంచి ముగింపు ‘టిల్లు స్క్వేర్’తో దొరికింది. ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ని నవ్వించింది. సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లుగా మెరిశాడు. తన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశాడు. సినిమా అప్పుడే లాభాల బాట పట్టిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మలయాళం డబ్బింగ్ గా వచ్చిన ‘ఆడు జీవితం’మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది.
ఈ క్వార్టర్లీ రిపోర్ట్ ను ఒక్కసారి చెక్ చేసుకుంటే.. విజయాలు కంటే అపజయాలే ఎక్కువ వున్నాయి. హనుమాన్, ఓం భీమ్ బుష్’, టిల్లు స్క్వేర్ ఈ మూడు సినిమాలు తప్పితే యునానిమస్ హిట్ అనిపించుకున్న మరో సినిమా కనిపించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటివరకూ బిగ్ స్టార్ హిట్ పడలేదు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, రవితేజ.. ఇలా అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద కలసి రాకపోవడంతో సందడి తగ్గిందనే చెప్పాలి. ఈ మూడు నెలలు గనుక చూసుకుంటే విజయాల్లో ఈ జోరు సరిపోదు. సక్సెస్ రేట్ పెరగాలి. ఆ లోటుని ఏ సినిమాలు భర్తీ చేస్తాయో చూడాలి.