దీపావళి కాంతులతో టాలీవుడ్ కళకళలాడిపోతోంది. ఎందుకంటే.. దీపావళి సందర్భంగా నాలుగు కొత్త సినిమాలురిలీజ్ కాబోతున్నాయి. అందులో `జై భీమ్` రెండు రోజుల ముందే పలకరించేసింది. ఇప్పుడు`పెద్దన్న`, `మంచి రోజులు వచ్చాయి`, `ఎనిమీ` సినిమాలు అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. రజనీకాంత్ నటించిన `పెద్దన్న`పై పెద్ద పెద్ద ఆశలే ఉన్నాయి. ఈ చిత్రానికి శివ దర్శకుడు. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. రజనీకాంత్ ఓ పూర్తి స్థాయి మాస్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. తన మార్క్ డైలాగులు, ఫైట్ల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ… `పెద్దన్న` విందు భోజనంలా మారబోతోంది. నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, జగపతిబాబు…ఇలా స్టార్ కాస్టింగ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. తమిళనాటే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా మంచి వసూళ్లే దక్కించుకునే అవకాశం ఉంది.
మరోవైపు… మారుతి `మంచి రోజులు వచ్చాయి` కూడా గురువారమే వస్తోంది. `పక్కా కమర్షియల్` సినిమాని పక్కన పెట్టి మరీ… మారుతి ఈ చిన్న సినిమా పూర్తి చేశాడు. కేవలం 20 రోజుల్లో స్క్రిప్టు పూర్తి చేసి, 30రోజుల్లో షూటింగ్ ముగించాడు మారుతి. ప్రమోషన్లు కూడా భారీగానే చేస్తున్నారు. మారుతి మార్క్ పక్కా కామెడీ సినిమా ఇది. కామెడీకి మంచి గిరాకీ ఉంటుంది. పైగా.. పండగ సీజన్ కాబట్టి, కుటుంబం మొత్తం థియేటర్లకు రావాలనుకుంటారు. అలాంటి వాళ్లకు ఇది మంచి ఆప్షన్.
వీటితో పాటు విశాల్ – ఆర్యల `ఎనిమి` విడుదలకు సిద్ధమైంది. ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదో థ్రిల్లర్… కథలో మలుపులు, విశాల్, ఆర్యల మధ్య పోరాట సన్నివేశాలు, మైండ్ గేమ్ ఇవన్నీ – ఈ సినిమాకి మూలస్థంభాలుగా మారబోతున్నాయి. యాక్షన్ ప్రియులకు నచ్చే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. మూడూ మూడు రకాల సినిమాలే. మూడింటికీ టికెట్లు తెగే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ వీకెండ్ కాబట్టి – మరిన్ని వసూళ్లు పిండుకోవొచ్చు. మరి ఫైనల్ గా ఈ దీపావళికి ఎవరి టపాసు పేలుతుందో చూడాలి.