2023 చరిత్రలో కలిసింది. తెలుగు పరిశ్రమకు ఆస్కార్, జాతీయ వార్డులు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి అగ్ర కథానాయకులు హిట్ చిత్రాలతో ఘనంగా నిలిచింది. ఇప్పుడు అంతకు మించిన సినిమా సందడి 2024లో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ ఏడాది సినిమాల జాతర కన్నుల పండువగా ఉండబోతుంది. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి నాలుగు సినిమాలు ముస్తాబౌతున్నాయి. ఈ నాలుగూ దేనికవే ప్రత్యేకమైన చిత్రాలు. మహేష్ బాబు, త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’పై అందరి ద్రుష్టి సహజంగానే వుంటుంది. ఈ ఇద్దరూ కలసి చేసిన మూడో చిత్రమిది. అల వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒక ప్రత్యేక పంధాలో వుంటాయి. గుంటూరు కారం మాత్రం ఫ్యాన్స్ ని తృప్తి పరచడానికి మహేష్, త్రివిక్రమ్ బలంగా నిర్ణయించుకున్నారని ఇప్పటివరకూ వచ్చిన ప్రోమోస్ చూస్తుంటే అర్ధమౌతోంది.
వెంకటేష్ 75వ మైలు రాయి చిత్రంగా వస్తోంది సైంధవ్. ఇదొక న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్. వెంకటేష్ ఒక పాపకి తండ్రిగా, తన వయసు తగిన పాత్రలో కనిపిస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను ట్రాక్ రికార్డ్ బావుంది. ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. ట్రైలర్ లో దాదాపు కథ చెప్పేశారు. సినిమా లోపల వున్న కంటెంట్ పై మేకర్స్ నమ్మకానికి ఇది అద్దం పట్టింది. నాగార్జున నా సామిరంగతో వస్తున్నారు. నాగ్ కు సంక్రాంతి ట్రాక్ రికార్డ్ వుంది. నా సామిరంగలో ఆ వైబ్ కనిపిస్తోంది. పైగా ఆయన నుంచి ఏడాదిగా సినిమా రాలేదు. ఆ రకంగా నా సామిరంగ ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలన్నిటితో పోల్చితే స్టార్ బలం తక్కువ వున్న సినిమా ‘హనుమాన్’. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా మంచి అవుట్ పుట్ ని ఎచీవ్ చేశాడు. అది ట్రైలర్, టీజర్ లో కనిపించింది. కోట్లు ఖర్చు చేసి తీసిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే హనుమాన్ వర్క్ చాలారెట్లు బెటర్ గా వుందని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మంచి బజ్ వున్న చిత్రంగా నిలిచింది హనుమాన్. ఇక సంక్రాంతికి రావాల్సిన ‘ఈగల్’ ఫిబ్రవరి 9కి వెళ్లిపోయింది. ఆరోజున రావాల్సిన ‘టిల్లు స్వ్కేర్’, ‘యాత్ర 2’ ఎప్పుడొస్తాయన్న విషయంలో క్లారిటీ రావాల్సివుంది.
రామ్, పూరి జగన్నాథ్ కలసి ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ చేస్తున్నారు. ఇది మహాశివరాత్రికి ప్లాన్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మాస్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ని తెరపై చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు అభిమానులు. వారి అంచనాలను అందుకునేలా ‘దేవర’గా రాబోతున్నారు ఎన్టీఆర్. ‘దేవర’ రెండు భాగాలుగా విడుదలౌతుంది. తొలి భాగం ఏప్రిల్ 5న రానుంది. ఎన్టీఆర్, కొరటాలది సూపర్ హిట్ కాంబినేషన్. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ దేవర కోసం జత కట్టారు. అటు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రం 2024లో క్రేజియస్ట్ సినిమాల్లో ఒకటి.
సలార్ తో 2023 కు గ్రాండ్ గా గుడ్ బై చెప్పిన ప్రభాస్.. 2024లో అంతకుమించిన భారీ వినోదాలతో ప్రేక్షకుల ముందురావడానికి రెడీ అవుతున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ తో పాన్ వరల్డ్ లోకి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు కమల్ హసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇంటర్ నేషనల్ బ్రాండ్ తో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబధించిన ఏ అప్డేట్ కూడా లోకల్ గా ఇవ్వడం లేదు. శాన్ డియాగో ఫెస్ట్ లో టీజర్ లాంచ్ చేశారు. మేకింగ్ వీడియోని రిలీజ్ చేయడానికి కూడా ముంబై ఐఐటీ ని ఎంచుకున్నారంటే కల్కి పరిధి అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రభాస్ కెరీర్ లోనే కల్కి అతి భారీ చిత్రంగా వస్తోంది. మరోవైపు ప్రభాస్ – మారుతి కలయికలో రూపొందుతోన్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇదొక హారర్ థ్రిల్లర్. ప్రభాస్ లాంటి హీరో.. హారర్ టచ్ వున్న స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకోవడమే ఆసక్తికరంగా వుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ యేడాదే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రావచ్చు,
‘పుష్ప 2: ది రూల్’ తో ఆగస్టు 15న సినిమా థియేటర్లలోకి వస్తున్నారు అల్లు అర్జున్. పుష్ప ఘన విజయంతో పార్ట్ 2 పై అంచనాలు సహజంగానే పెరిగాయి. అందుకుతగ్గట్టుగా సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం, శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న తొలి చిత్రం.. చరణ్ ద్విపాత్రభినయం చేస్తున్న చిత్రం..ఇలా చాలా విశేషాలతో ఆసక్తిని పెంచింది. ‘పుష్ప 2, ‘గేమ్ ఛేంజర్’ ఈ రెండూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలే.
‘వీరసింహా రెడ్డి’ విజయం తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ అడ్వంచర్ ని చేస్తున్నారు చిరంజీవి. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాదే ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘హరి హర వీరమల్లు’ ఇలా మూడు క్రేజీ ప్రాజెక్ట్ లు సెట్స్ పై ఉంచారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా వున్నారు. షూటింగ్ లో జాయిన్ అయ్యే సమయం వీలుపడితే గనుక ఇందులో ‘ఓజీ’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.
దీంతో పాటు నాని ‘సరిపోదా శనివారం’, విజయ్ దేవరకొండ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’, నాగచైతన్య ‘తండేల్’, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’, అడివి శేష్ ‘గూఢచారి 2’ లాంటి ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఏడాది ప్రేక్షకులని అలరించబోతున్నాయి.