గుడివాడ బరిలో దేవినేని అవినాష్.. తొడకొట్టారు. నామినేషన్ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించి… వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి అంత తేలిక కాదన్న సంకేతాలను బలంగా పంపారు. బుధవారం.. కొడాలి నాని నామినేషన్ వేశారు. కానీ.. అంత గొప్పగా.. జన సేకరణ జరపలేకపోయారు. దేవినేని అవినాష్ మాత్రం.. తన సత్తా చాటారు. గుడివాడకు నాన్ లోకల్ అయినప్పటికీ.. అవినాష్.. చాలా త్వరగా.. నియోజకవర్గంలో పాతుకుపోయారు. అభ్యర్థిత్వం ఖరారు చేసినప్పటి నుంచి గుడివాడలోనే మకాం వేసారు. ప్రజల్లో ఒకడిగా కలసిపోతూ అవినాష్ చేస్తున్న ప్రచారం మాస్లో ఆయనపై విపరీతమైన క్రేజ్‌ను పెంచుతోంది. టిక్కెట్లు ఆశించిన నేతలు కూడా కలసి కట్టుగా పని చేస్తున్నారు. రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు సంపూర్ణంగా సహకరిస్తున్నారు.
టీడీపీకి పెట్టనికోటగా ఉన్న గుడ్లవల్లేరు మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కొసరాజు బాపయ్యచౌదరి నాయకత్వంలో ప్రచారం ప్రారంభించారు. నందివాడ మండలంలోని జనార్థనపురంలో గత ఎన్నికల్లో వైసీపీలో ఉన్న టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మలిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరడంతో రాజకీయాల్లో మార్పు వచ్చింది. మరోవైపు కొడాలి నాని వైసీపీకి పట్టు ఉన్న నందివాడ మండలం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన వైసీపీకి ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్న ఓటుబ్యాంకును కాపాడుకునే దిశగా పావులు కదుపుతున్నారు. గుడివాడ పట్టణంలో వైసీపీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి బలమైన గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే నాని వ్యూహాలు పారడం లేదు. టీడీపీలోని విభేదాలను సొమ్ము చేసుకుందామని ఆశించినా, అవినాష్ రాకతో వాటికి బ్రేక్ పడింది. దాదాపు అన్ని మండలాల్లో పాత క్యాడర్‌ను టీడీపీ తన వైపు తిప్పుకోగలిగింది.
పదిహేనుళ్లుగా కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో ఉండరన్న ప్రచారం ఉంది. అదే సమయంలో.. ఆయనకు బాగా దగ్గర అనుకున్న అనుచరులు కూడా టీడీపీలో చేరారు. అందరిలోనూ ఆయన అనుచితంగా మాట్లాడతారన్న ప్రచారం ఉంది. దీంతో కొడాలి నానిపై వ్యతిరేకత పెరిగింది. ఇప్పటి వరకూ సరైన లీడర్ లేరన్న కారణంమే ఆయన అనుకూలాంశం. తాను అండగా ఉంటానని అవినాష్ .. భరోసా ఇస్తున్న ప్రభావం నామినేషన్లో కనిపించింది. పది వేలక మందికిపైగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతో.. గుడివాడ రూటు మారుతోందన్న ప్రచారం ఊపందుకుంది.