మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ఫైళ్లను కాల్చేయడం లేదా మాయం చేయడం అనే పెద్ద టాస్క్ ఇప్పుడు హైదరాబాద్ లో అమలవుతోంది. ఓటింగ్ పూర్తి అయిన వెంటనే టూరిజం శాఖ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలకమైన ఫైల్స్ తగలబడ్డాయి. ఆ ఆగ్నిప్రమాదమే విచిత్రంగా ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో… ఫైళ్లచోరీ కథలు వెలుగులోకి వచ్చాయి.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రవీంద్ర భారతిలో ఓ ఆఫీసు ఉంది., ఓడిపోయినట్లు తేలగానే ఆయన మొత్తం ఆఫీసును ఖాళీ చేసేశారు. సొంత ఆస్తి అయినట్లుగా పట్టుకుపోయారు. మధ్యలో కొంత మంది చూసి అడ్డుకోవడంతో బయటకు వచ్చిది. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ఒకరు పశుసంవర్థక శాఖ ఫైళ్లను మాయంచేస్తూ దొరికిపోయారు. మరో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆఫీసులోనూ ఇలా ఫైళ్లు మాయం అయ్యాయి. ఇవి బయటకు వచ్చాయి కానీ.. గుట్టుగా ఎంత మంది బయటకు పంపేశారో లెక్క లేదు.
ఫలితాలు వచ్చిన వెంటనే… అధికారులకు చీఫ్ సెక్రటరీ ఓ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. ఒక్క ఫైల్ కూడా బయటకు పోకూడదన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇష్టం వచ్చినట్లుగా తరలిస్తూనే ఉన్నారు. గెలుపుపై విపరీతమైన ధీమాతో ఉన్న బీఆర్ఎస్ నేతలు మొదట్లో సర్దుకోలేదని.. తీరా ఓడిపోయాక..ఎక్కడ దొరికిపోతామోనని కంగారు పడుతున్నారంటున్నారు.
రేవంత్ రెడ్డి వదిలి పెట్టరని… ఎక్కువ మంది భయపడుతున్నారు. ఎదుకంటే రేవంత్ రెడ్డిని అందరూ విపరీతంగా టార్గెట్ చేసిన వాళ్లే. రేవంత్ కాస్త కుదురుకున్న తర్వాతైనా తమఫైల్స్ లో తప్పులు చూసి బుక్ చేస్తారని ముందు జాగ్రత్త పడటమే మంచిదని అనుకుంటున్నారు. అందుకే కేసులైనా పర్వాలేదు.. ఫైల్స్ మాయం చేయమని అనుచరులపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.