బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీ పెద్దలకు వణుకు పుట్టిస్తున్నారు. పార్లమెంట్లో ప్రభుత్వ నిర్వాకాలపై ఆమె ప్రసంగాలు ఎన్నో సార్లు వైరల్ అయ్యాయి. ఆమెకు మాట్లాడే అవకాశం వచ్చిందంటే అందరూ సైలెంట్ అయిపోతారు. ఆమె బయట పెట్టే వివరాలు తర్వాత చర్చనీయాంశమవుతాయి. అలాంటి ఎంపీని టార్గెట్ చేయకుండా ఉంటారా ?
మహువామొయిత్రాపై కొద్ది రోజులుగా వ్యక్తిగత దాడి జరుగుతోంది. ఆమె పార్లమెంట్ లాగిన్ దుర్వినియోగం చేశారని.. అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగేందుకు మరో వ్యాపారవేత్త వద్ద డబ్బులు తీసుకున్నారని.. తన లాగిన్ ను ఆ వ్యాపారవేత్తకు ఇచ్చారని ఇలా రకరకాల కథనాలు అల్లేశారు. పార్లమెంట్ లో అరాచక ప్రవర్తనకు నిలువెత్తు రూపం అన్నట్లుగా ఉండే దూబే అనే బీజేపీ ఎంపీని ఆమెపై దాడికి ఉపయోగించుకుంటున్నారు. ఆయన చేసిన ఆరోపణల్లో కనీస ఆధారాలు లేకుండానే విస్తృత ప్రచారం ప్రారంభించారు. చివరికి ఆ వ్యాపార వేత్తను బెదిరించి ఓ నోట్ కూడా రిలీజ్ చేయించారు. ఆ వ్యాపారవేత్త అంతకు మూడు రోజుల ముందే ఖండించారు. కానీ ఓ నోట్ రిలీజ్ చేయించారు. తర్వాత దుబాయ్ లాగిన్ అని మరొకటని ప్రచారం ప్రారంభించారు. కమిటీలు వేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఒక్క ఆధారం కూడా వెలుగులోకి రాలేదు. నిజంగా ఆధారాలు ఉంటే… వాటిని మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్ చేసేవారు.
తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంపైనా నిందలేస్తున్నారు. శశిథరూర్ తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో పాల్గొంటే.. ఫోటోలు క్రాప్ చేసి.. వాళ్లదిద్దరే పార్టీలో పాల్గొన్నట్లుగా ప్రచారం చేశారు. ఆమె క్యారెక్టర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహువా మొయిత్రా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నత స్థాయి పరిజ్ఞానం ఉన్న నేత. విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చారు. ఆమె డైనమిజాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేరు. అందుకే..తమ పార్టీ ఎంపీ అయినా.. మహువాను కంట్రోల్ చేయాలని మమతా బెనర్జీ అనుకున్నా సాధ్యం కాలేదు. తాను నమ్మిన సిద్ధాంతానికే మొయిత్రా కట్టుబడతారు. ఈ క్రమంలో తన క్యారెక్టర్ పై నిందలేసినా పోరాటం ఆపడం లేదు.
అదానీ వ్యవహారాల గురించి ఆమె ఎన్నో సార్లు సంచలన విషయాలు బయట పెట్టారు. అలాంటి ఆమె ఎన్ని ఒత్తిళ్లు వస్తాయో చెప్పాల్సిన పని లేదు. కానీ ఆమె తగ్గడం లేదు. దేశంలో మహిళల పట్టుదల, పరాక్రమానికి ఆమె చిహ్నంగా నిలుస్తున్నారన్న ప్రశంసలు.. ఆమె పోరాట స్ఫూర్తికి లభిస్తున్నాయి.