కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు ఇక గత్తర పుట్టిస్తారు అని టీఆర్ఎస్ వర్గాలు అదే పనిగా ప్రచారం చేశాయి కానీ చివరికి కేసీఆర్ ఎవరితోనూ సమావేశం కాలేదు. ఆంతరంగిక సమవేశాలకే పరిమితమయ్యారు. కేజ్రీవాల్‌తో భేటీ అయిపోయారని మంగళవారం విస్తృత ప్రచారం చేశారు కానీ అంతా ఉత్తదే. కేజ్రీవాల్ అందుబాటులో లేరు. ఆయన బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స తీసుకుంటున్నారు. మరో వారం తర్వాతే ఢిల్లీకి వస్తారు. దీంతో కేజ్రీవాల్‌తో భేటీ అనే చాన్సే లేకుండా పోయింది.
ఇక ఇతర నేతలెవరూ కేసీఆర్‌కు అందుబాటులో లేరు. ఉన్న వారు ఆయనతో చర్చించడానికి సిద్ధంగా లేరు. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై టీఆర్ఎస్ వర్గాలు రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నప్పటికీ.. కేసీఆర్ పర్యటన అసలు ఉద్దేశం వైద్య చికిత్స అని చెబుతున్నారు. కేసీఆర్ మంగళవారం నిజాముద్దీన్ సమీపంలో ఉన్న దంత వైద్యుడి వద్దకు వెళ్లారు. ఎంపీగా ఉన్నప్పటి నుండి ఆయన వద్దే చూయించుకుంటారు. అలాగే ఆయన సతీమణి బుధవారం ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి వారణాశిలో ప్రచారం చేయాలని కేసీఆర్ అనుకున్నప్పటికీ ఆయనకు ఆహ్వానం అందలేదు. ఆయనను పిలుస్తారేమో అని చాలా మంది అనుకున్నారు కానీ.. పిలవడం లేదు. దీంతో ఆయన కూడా వారణాశి వెళ్లాలనే ఆలోచన విరమించుకున్నారని అంటున్నారు. గతంలోనూ కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ నాలుగు రోజుల పాటు సైలెంట్‌గా ఉండి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్రకటనలు చేయకపోయినా… టీఆర్ఎస్ నేతలు ఆ స్టైల్లో ప్రచారం చేశారు చివరికి ఎలివేషన్లన్నీ తేలిపోయాయి. కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.. వచ్చారన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.