గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఐటీ, ఈడీ నోటీసులు జారీ చేసి..సోదాలు చేస్తే..ఇప్పుడు సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. గురువారం ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. గ్రానైట్‌లో చేసినవన్నీ ఆర్థిక అవకతవకలు.. మరి సీబీఐ ఎందుకు అంటే.. ఈ కేసుల్లోనుంచి బయటపడేందుకు వీరు తెర వెనుక ప్రయత్నాలు చేసి దొరకిపోయినట్లుగా వివరాలు బయటకు రావడమే.
మూడు రోజుల కిందట.. కొవ్విడి శ్రీనివాస్ అనే నకిలీ సీబీఐ అధికారిని.. సీబీఐ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర ఉన్న సమాచారం అంతా బయటకు తీస్తే గంగుల కమలాకర్, వద్ది రాజు రవిచంద్ర వ్యవహారాలే వెలుగులోకి వచ్చాయి. వారి తరపున కేసులు లేకుండా చేసేందుకు .. ఈడీ, ఐటీ అధికారులకు లంచాలు ఇచ్చేందుకు కొవ్విడి శ్రీనివాస్‌ను రంగంలోకి దింపినట్లుగా తేలింది. దీంతో నిర్ధారించుకునేందుకు ముందుగా వారికి నోటీసులిచ్చి ఢిల్లీ పిలిపిస్తున్నారు. మామూలుగా అయితే హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించేవారు. కానీ మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారంలో జరిగిన పరిణామాలు చూసి ఢిల్లీకే పిలిపించినట్లుగా భావిస్తున్నారు.
గ్రానైట్ వ్యవహారాల్లో ఈడీ, ఐటీ కేసుల నుంచి రక్షించేందుకు ఢిల్లీ స్థాయిలో పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చేందుకు గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర అంగీకరించినట్లుగా సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. వారి కోసమే కొవ్విడి శ్రీనివాస్‌ను ఢిల్లీకి పంపారని చెబుతున్నారు. ఈ అంశంపై విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. కొవ్విడి శ్రీనివాస్ ఫోన్, ల్యాప్ ట్యాప్‌లో సంచలన విషయాలు ఉన్నట్లుగా సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.