హైదరాబాద్: ఎప్పుడెప్పుడు కేంద్రమంత్రి అవుదామా అని ఉవ్విళ్ళూరుతున్న టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి. కేంద్రంపట్ల తటస్థవైఖరిని అవలంబించిన టీఆర్ఎస్, అకస్మాత్తుగా స్వరం పెంచింది. ఆ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేత వినోద్ నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఏడాదిపాటు ప్రజలు నరేంద్రమోడిని విశ్వసించారని, కానీ ఇప్పుడు ఆ నమ్మకం క్రమంగా కోల్పోతున్నారని వినోద్ వ్యాఖ్యానించారు. ముగ్గురు కేంద్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు సంబంధించిన విషయాలలోనూ ప్రధాని వైఖరితో తాము విశ్వాసం కోల్పోతున్నామని అన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకూ వేర్వేరుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నవిషయాన్ని గుర్తు చేస్తూ, దీనిపై రెండునెలల్లో హైకోర్టు విభజన చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, నేటికీ అది ఆచరణ దాల్చలేదని చెప్పారు. ప్రధాని మోడి చంద్రబాబును బతికించేందుకు ప్రయత్నిస్తున్నారని వినోద్ ఆరోపించారు. అటు తెలంగాణ దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్రెడ్డికూడా మోడి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి చూపిస్తోందని ఆరోపించారు. మొత్తంమీద చూస్తే కేంద్రం విషయంలో టీఆర్ఎస్ వైఖరి ఘర్షణపూరితంగానే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశాలు మృగ్యమని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మరి కేంద్రమంత్రి కావాలని కలలు కంటున్న కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోయేటట్లున్నాయి…పాపం!