రాజకీయం అంటే అంతే మరి. ఆర్మీ ఆశావహులు సికింద్రాబాద్‌లో ఆందోళన చేస్తూంటే కాల్పులు జరిపారు. అందులో ఒకరు చనిపోయారు. వెంటనే ఆ ఆశావహ అభ్యర్థి కొంత మంది విప్లవకారుడు అయ్యారు. చాలా రాజకీయ పార్టీలకు ఆయన అమరవీరుడయ్యారు. తెలంగాణ అధికార పార్టీకి ఆయన మరీ అవసరం అయ్యారు. వెంటనే ఆయన కులం తీసుకుని తెలంగాణ బీసీ బిడ్డ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. కేసీఆర్ చురుగ్గా స్పందించి.. రూ. పాతిక లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం ఆ కుటుంబానికి ఆఫర్ చేశారు. టీఆర్ఎస్ నేతలు వెంటనే ఆ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.
చనిపోయిన వ్యక్తి వరంగల్‌కు చెందిన వారు కాబట్టి వరంగల్ బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. అధికార పార్టీ కాబట్టి అక్కడ బంద్ అందరూ చేయక తప్పదు. ఆందోళలను టీఆర్ఎస్ ప్రోత్సహిచిందన్న ఆరోపణలు ఓ వైపు వస్తున్నాయి. మరో వైపు ఆ ఆందోళనల్లో చనిపోయిన వారికి మద్దతుగా టీఆర్ఎస్ క్విక్ పాలిటిక్స్ ప్రారంభించింది. అదే సమయంలో బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తూంటే కనీసం కన్నెత్తి చూడటం లేదు. వారంతా చిన్న పిల్లలు తమ భవిష్యత్ కోసం.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
కానీ ప్రభుత్వం మాత్రం వారివి రాజకీయ ఆందోళనలు అంటోంది. పిల్లలవి సిల్లీ డిమాండ్స్ అంటోంది. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అంటున్నారు. కానీ రైల్వే ఆందోళనలను మాత్రం టీఆర్ఎస్ మరో విధంగా తీసుకుంటోంది. చనిపోయిన వారితో రాజకీయాలు ప్రారంభించిందన్న విమర్శలు ఎదుర్కొంటోంంది. రాజకీయం బ్రహ్మరాక్షసి అని పెద్దలు ఊరకనే అనలేదని.. ఇలాంటివే నిరూపిస్తాయని కొంత మంది నిట్టూరుస్తున్నారు.