ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా… ఈ అంశం ఎన్ని సున్నితమైందో తెలిసిందే. ఏపీకి హోదా ఇవ్వకపోవడం వల్లనే భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు, ఏపీలోని వైకాపా, టీడీపీలు కూడా హోదా సాధనకు తాము చేసిన ప్రయత్నాలు, చేస్తున్న పోరాటాలు, సాధించే మార్గాలను ప్రజలకు పెద్ద ఎత్తున వివరించాయి. ఎన్నికల్లో అదొక కీలక పాత్ర పోషించిన అంశం. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా మీద ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెరాస నాయకుడు వినోద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా అంటే ఏంటి అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జవాబు చెప్పాలంటూ ప్రశ్నించారు?
పార్లమెంటులో దీని గురించి చర్చ జరుగుతున్నప్పుడు అక్కడున్న టీడీపీ, వైకాపా ఎంపీలను దీని గురించి అడిగానన్నారు వినోద్. ఇంతకీ, హోదా ద్వారా మీరు అడుగుతున్నదేంటో చెప్పాలని కోరానన్నారు. ప్రత్యేక హోదా అంటే ఏంటంటే… 90 శాతం నిధులు రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని మాత్రమే అన్నారు. ఈ ప్రత్యేక హోదా అనే నిర్ణయం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లో జరుగుతుందన్నారు. కేవలం కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకే హోదా ఇవ్వాల్సి ఉంటుందని వినోద్ అన్నారు. ఆర్థికంగా వెనకబడ్డ ఆంధ్రాకి ఇవ్వాలనుకుంటే, దేశంలో దాదాపు చాలా రాష్ట్రాలు అలానే వెనకబడి ఉన్నాయనీ, ఆ లెక్కన వారికీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రాకి రాజధాని లేదనీ, ఆ కారణం సరిపోదనీ, ఇంత కంటే అధ్వాన్నమైన రాజధాని ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయన్నారు వినోద్. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వ్యతిరేకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదనీ, ఇంతకీ ప్రత్యేక హోదా ఏంటనే విషయానికి ఏపీ పార్టీలు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రమే అంటున్నా అన్నారు.
ప్రత్యేక హోదా అనే దానికే ప్రాధాన్యత లేకపోతే… ఆంధ్రాకి హోదా ఇవ్వాలంటూ అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తానని ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వ్యాఖ్యానించినట్టు..? సరే, ఆంధ్రులు అడుగుతున్నారు కాబట్టి, అది ఇచ్చెయ్యండని కేసీఆర్ సిఫార్సు చేసేందుకు సిద్ధపడ్డారే అనుకుందాం! ఆంధ్రాకి హోదా ఇస్తే అదే స్థాయిలో మాకూ ప్రయోజనాలు ఇచ్చి తీరాలంటూ హరీష్ రావు కూడా చాలాసార్లు డిమాండ్ చేశారు. దానికి ప్రాధాన్యతే లేదు, సరైన నిర్వచనమే లేదు అనుకున్నప్పుడు… ఆంధ్రాకి ఏదిస్తే, అదీ మాకూ ఇవ్వండని హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేశారు? ప్రత్యేక హోదా విషయమై తనకి ఉన్న అవగాహనను సొంత పార్టీ నేతలతో వినోద్ పంచుకోలేదా..? ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న కేసీఆర్ కి సైతం ఈ మాట చెప్పలేదా..?