లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ చేయాలనుకుంటున్న టీఆర్ఎస్కు పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచార సభల్ని హోరెత్తించాలనుకున్న కేసీఆర్‌కు… జనం లేక ఓ సభను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకూ.. బహిరంగ సభలను కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ రోజు కేసీఆర్ మిర్యాలగూడ, హైదరాబాద్‌లలో బహిరంగసభల్లో ప్రసంగించాల్సి ఉంది. ఒక్కో సభ.. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉంటుందని… ఆ మేరకు జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. మిర్యాలగూడ సభకు జనాలు బాగానే వచ్చినప్పటికి.. హైదరాబాద్ సభ విషయంలో.. నేతలందరూ లైట్ తీసుకున్నారు.
జన సమీకరణ విషయంలో..అందరూ… తమకు పట్టనట్లుగా వ్యవహరించారు. ఒకరు చేస్తారులే అని మరొకరు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో.. బహిరంగసభ ఏర్పాటు చేసిన ఎల్బీ స్టేడియం బోసిబోయింది. మిర్యాలగూడలో సభ ముగిసిన తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించాలనుకున్నారు. దాని ప్రకారమే… బయలుదేరారు కూడా. కానీ.. ఆరేడు గంటల సమయానికి సభ పెట్టుకున్నా… జనం లేకపోవడం.. స్టేడియం అంతా ఖాళీగా ఉండటంతో… కేసీఆర్ సభను రద్దు చేసుకుని.. ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజవర్గాలకు సంబంధించి నేతలు.. జన సమీకరణ చేస్తారనుకున్నారు. కానీ సమన్వయం లేకపోవడంతో… నేతలు జన సమీకరణలో ఫెయిలయ్యారు.
పదహారు సీట్ల సాధనలో… సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలు… టీఆర్ఎస్ అత్యంత కీలకంగా భావించింది. గతంలో ఈ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ఎప్పుడూ విజయం సాధించలేదు. దీంతో.. ఎల్బీ స్టేడియం సభను.. ఘనంగా నిర్వహించి సత్తా చాటాలనుకుంది. కానీ జనం లేకపోవడంతో.. సభను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన అభ్యర్థుల ఓటమి తర్వాత.. ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో.. టీఆర్ఎస్ నేతలు షాక్‌కు గురయ్యారు. గ్రేటర్ నేతలపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.