మునుగోడులో టీఆర్ఎస్ నేతలంతా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబును చూసి ఇన్ స్పయిర్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దత్తత తీసుకుంటున్నామని చెబుతారు. మాకు టీఆర్ఎస్ చాలా ఇచ్చింది.. టీఆర్ఎస్కు ఎంతో కొంత ఇవ్వాలంటే.. మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని చెబుతున్నారు. అది కేటీఆర్ దగ్గర నుంచి ప్రారంభమయింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌కు వచ్చిన కేటీఆర్.. నియోజకవర్గం మొత్తం దత్తత తీసుకుంటానని మూడు నెలలకొకసారి వచ్చి దగ్గరుండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదేదో బాగుందనుకున్న మంత్రులు.. కూడా అదే బాట పట్టారు. అందరు మంత్రులకు గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమకు అప్పగించిన చోట్ల మెజార్టీ తీసుకు రావడానికి దత్తత ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే దత్తత తీసకుుంటామని హామీ ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎర్రబెల్లి కూడా చండూర్ మున్సిపాలిటీ దత్తత తీసుకుంటానన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్.. నెక్ట్స్ సీఎం అవుతారని.. కాబోయే సీఎం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నారని.. అభివృద్ధి అవకాశాన్ని వదులుకోవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల దత్తత రాజకీయాలపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. కేటీఆర్ దత్తత తీసుకోవడానికి మనుగోడు నియోజకవర్గ ప్రజలు ఏమైనా అనాథలా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం దత్తత తీసుకుంటామనే తమ హామీల్ని నమ్ముతారని.. ఓట్ల వర్షం కురిపిస్తారని టీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకమేంటో ఎన్నికల ఫలితాలతో తేలే అవకాశం ఉంది.