ఈటల రాజేందర్ బీజేపీలో తన వర్గాన్ని పెంచుకునేందుకు ఉద్యమకారులందర్నీ చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వారిలో ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా తిరుగుతున్న నేతలను బీజేపీ కండువా కప్పేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్వామిగౌడ్ బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఉద్యోగ నేత కూడా కాషాయం కండువా కప్పుకోనున్నారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్త్వరలో పార్టీలో చేరనున్నారు. ఉద్యమానికి పునాదులుగా నిలిచిన జేఏసీ నేతలు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఖాళీగా ఉన్నారు.
బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఉద్యోగ జేఏసీ నేత, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌తో పాటుగా మెడికల్ జేఏసీకి చెందిన కీలక నేతతో కూడా ఈటల చర్చలు జరుగుతున్నారు. వీరితో పాటుగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఉద్యమ నేతలను అధికార పార్టీకి దూరం చేస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
బీజేపీలో తన వర్గం కూడా బలపడుతుందని ఈటల భావిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్‌పై ఉద్యమకారులు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అలాంటి వారు తమకు అవకాశాలు వస్తాయంటే బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యమంలో పాల్గొనని వారు ఇప్పుడు టీఆర్ఎస్లో కీలక స్థానాల్లో ఉన్నారు. అది కూడా వారి అసంతృప్తికి ఓ కారణం.