ఆయన ఐఏఎస్ అధికారి. ఆయన కింద.. ఓ ఆఫీసర్ ఉండేవారు. ఆయన ఐఏఎస్ కాదు. సర్వీస్ ముగిసే వరకూ కూడా అయితే.. తను ఐఏఎస్‌గా కెరీర్ ప్రారంభించిన హోదాకు.. కూడా చేరుకోలేరు. కానీ ఇప్పుడు ఆ ఆఫీసర్.. నేరుగా.. ఆ ఐఏఎస్‌కే ఆదేశాలు జారీ చేసే రేంజ్‌కు వచ్చారు. కొత్తగా సివిల్స్ రాసి.. ఐఏఎస్ అవ్వలేదు.. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు. ఇది కనిపించడానికి సినిమా స్టోరీలా ఉన్నా.. ఇది తెలంగాణలో నిజంగానే జరిగింది. ఆయనే శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుత మంత్రి.
తెలంగాణా మంత్రి వర్గ విస్తరణలో మహబూబ్‌నగర్ యం యల్ ఏ శ్రీనివాస్ గౌడ్ కు చోటు దక్కింది. ఆయనకు ఎక్సయిజ్, పర్యాటక, యువజన, క్రీడా శాఖ అప్పగించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం చివరి వరకు, తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత కొంత కాలం వరకూ సోమేశ్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసారు. ఆ సమయంలో శ్రీనివాస్ గౌడ్ ..ఆయన కింది స్థాయి అధికారిగా రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేసారు. ఉద్యోగసంఘ నేతగా ఉద్యమం చేసి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. రెండో సారి కూడా గెలిచి మంత్రి అయ్యారు.
ప్రస్తుతం సోమేశ్ కుమార్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు తన కింది స్థాయి అధికారి ఐన శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఎక్సైజ్ మంత్రయ్యారు. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ కమిషనర్ గా సోమేశ్ కుమార్ ఆదేశాలు పాటించే వారు…ఇప్పుడు మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ ఇచ్చే ఆదేశాలను ముఖ్య కార్యదర్శి గా ఉన్న సోమేశ్ కుమార్ అమలు చేయాలి. ఈ అంశం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య గొప్పదనం ఇదే కావొచ్చు.