పులివెందుల నుంచి వచ్చి తనతో నడుస్తున్న కొంత మంది.. అప్పటికప్పుడు అడ్డాకూలీలను మాట్లాడి తెచ్చుకున్న మరికొంత మందితో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు. కాస్త హైప్ తెప్పించడానికి టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. షర్మిల అసభ్యంగా మాట్లాడుతున్నారంటూ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య తదితరులు స్పీకర్‌ను కలిసి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
చట్టసభల ప్రతినిధులు అనే స్పృహలేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా అవమానిస్తున్నదని.. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు, జుగుప్సాకర ఆరోపణలు చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా పరిగణిస్తామని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. వీరి ఫిర్యాదుపై షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకునే ముందు నిరంజన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
షర్మిల పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ఆమె మహిళ అనే అడ్వాంటేజ్‌ను తీసుకుని ఇతరుల్ని ఇష్టారీతన తిడుతున్నారు. ముఖ్యమంత్రిని ఉరేసుకోవాలంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చెప్పుతో కొడతానంటున్నారు. ఆమె భాష తీరుచూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో వైసీపీ నేతలు ఇంత కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలా ఇతరుల్ని తిట్టడం ఏమిటన్న అభిప్రాయం చూసిన వారికి వస్తోంది.