తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు దళిత బంధుతో ఎవరికీ చెప్పుకోలేనన్ని సమస్యలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ మార్చి లోపు ప్రతి నియోజకవర్గంలో వంద మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ ఎంపిక జరుగుతోంది. ఎంత చేసినా వంద మందికే ఇవ్వాలి. దీంతో ఎమ్మెల్యేలు ఎవరికి ఇవ్వాలా… ఇప్పించాలా అని మనోవేదనకు గురవుతున్నారు.
దళిత బంధుకు ప్రత్యేకంగా అర్హతలేమీ లేవు. అందరికీ ఇస్తారు. మరి వంద మందిని ఎలా ఎంపిక చేస్తారు..? . టీఆర్ఎస్ నేతల ఇష్టప్రకారమే ఎంపిక జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు తెలిసిన వాళ్లు.. పార్టీ కోసం పని చేసిన దళిత నేతలు.. పెద్ద ఎత్తున సిఫార్సులు తీసుకు వస్తున్నారు. చాలా మంది తమకు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ఇవ్వకపోతే అలుగుతున్నారు. ఈ పరిస్థితి ఎమ్మెల్యేలంతా ఎదుర్కొంటున్నారు. కొంత మంది ఎందుకివ్వరని ఎదురుదాడికి దిగుతున్నారు. ఆందోళనలూ చేస్తున్నారు. ఎంత చేసినా వంద మందికే ఇచ్చే చాన్స్ ఉందని వారికి నచ్చ చెప్పడానికి టీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు.
ఇది మార్చి వరకేనని వచ్చే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తారని.. అప్పుడు అందరికీ ఇస్తామని చెబుతున్నారు. కానీ భవిష్యత్ సంగతేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వాలనే పట్టుబడుతున్నారు. ఈ బాధలను చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలకు అవకాశం కూడాచిక్కడం లేదు. ఒకరికి ఇచ్చి వందమందికి వ్యతిరేకం కావడం ఎందుకో ఎమ్మెల్యేలకూ అర్థం కావడం లేదు. ఈ సమస్య నుంచి ఎలాబయటపడాలో తెలియక తంటాలు పడుతున్నారు.