తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మొత్తం గులాబీమయం అయిపోయింది. ఏ మూల చూసినా ముఖ్యంగా పార్టీ శ్రేణులు వచ్చే దారుల నిండా టీఆర్ఎస్ ఫ్లెక్లీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు తమను ఎస్టాబ్లిష్ చేసేందుకు తమ ఫోటోకు ప్రాధాన్యం ఇచ్చి ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటిలోనూ కామన్‌గా అందరి కంటే ఎక్కువగా కేసీఆర్‌కు ప్రాధాన్యం లభించింది. అది సహజమే. అయితే కేటీఆర్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
ఇటీవలి కాలంలో ఎక్కువగా కేటీఆర్ నామస్మరణ టీఆర్ఎస్లో జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి పెద్ద ఈవెంట్ జరిగినా కేటీఆర్ ముద్ర బలంగా ఉంటోంది. ఎక్కడ చూసినా కేసీఆర్‌తో సమానంగా కేటీఆర్ ఫోటోలు, ఫ్లెక్సీలు, కటౌట్లు దర్శనమిస్తూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్‌కే ప్రాధాన్యం. పార్టీ నేతలకు ఈ అంశంపై స్పష్టమైన సూచనలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
కేసీఆరే ఆధ్యక్షుడిగా ఎన్నికవబోతున్న కారణంగా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని.. అనవసర చర్చలకు కారణం అవకుండా కేసీఆర్‌కు మాత్రమే స్పేస్ ఇవ్వాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. మరో వైపు మున్సిపల్ మంత్రిగా నీతులు చెప్పే కేటీఆర్.. నిబధనలకు విరుద్ధంగా నగరం మొత్తం ఫ్లెక్సీలతో నింపేయడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కొంత మంది లీడర్లకు ఎంతో కొంత ఫైన్ వేసి.. దాన్ని కవర్ చేసుకునే అవకాశం ఉంది.